చంద్రరేఖ స్వయంవరం – Chandra Rekha Swayam Varam Telugu Kids Story Bethala katha
పూర్వం కనకపురి రాజ్యాన్ని జయకేతనుడనే రాజు పాలించేవాడు. ఆయన కుమార్తె చంద్రరేఖ అద్భుత సౌందర్యవతి. ఆమెకు చదరంగం లో మంచి ప్రావీణ్యం వుండేది. రాజు జయకేతనుడు చదరంగం లో అత్యంత ప్రతిభావంతుడు కావడంతో, ఆమెకు బాల్యం నుంచి మంచి శిక్షణయివ్వడం వల్ల, చంద్రరేఖ చదరంగం లో రాటుతేలింది.
ఇలావుండగా ఒకనాడు చంద్రరేఖ వివాహ ప్రసక్తి వచ్చింది. ఆమె, తండ్రితో, “నాన్నగారూ! నన్ను చదరంగం లో ఓడించిన రాకుమారుణ్ణే వివాహమాడతాను. నాతో మొదటిసారి ఆడి ఓడిపోయిన రాకుమారుడికి నూరు కొరడా దెబ్బలు శిక్ష. రెండవసారి ఓడిపోతే, తిరిగి జీవితంలో వివాహం మాట తలపెట్టనని కులదైవం మీద ప్రమాణం చేయ్యాలి. ఇక, మూడవసారి కూడా ఓడిపోతే ఉరిశిక్షకు గురికావలసి ఉంటుంది. ఈ విధంగా చాటింపు వేయించండి,” అన్నది.
ఆమె వింత కోరికకు జయకేతనుడు ఆశ్చర్యపోయాడు. అయినా, కుమార్తె మొండి పట్టుదల తెలిసిన వాడవడంచేత, ఆమె కోరిన విధంగా చాటింపు వేయించాడు.
కొంత మంది రాకుమారులు, జగదేకసుందరి అయిన చంద్రరేఖను వివాహమాడాలని చదరంగం పోటీలో పాల్గొన్నారు. వాళ్ళందరూ చదరంగంలో అంతో ఇంతో ప్రావీణ్యం కలవాళ్ళే, కానీ అద్భుతనైపుణ్యం కలిగిన యువరాణీకి సమఉజ్జీలు కాలేకపోయారు. పోటీలో పాల్గొనడం, గడియకలాం గడవకముందే పరాజితులు కావడం పరిపాటయిపోయింది. వాళ్ళు స్వయంవర నియమం ప్రకారం వంద కొరడా దెబ్బలు తిని, అవమాన భారం తో తమ తమ రాజ్యాలకు తిరిగిపోయారు. ఏ ఒక్కరూ యువరాణితో రెండవసారి పోటీలో పాల్గొనడానికి సిద్ధపడలేదు.
ఇలా ఉండగా- చారుశీల నగరాన్ని పాలించే సూర్యతేజకు, ఈ వింత స్వయంవరం వార్త తెలిసింది. అతడు అవివాహితుడు. అంతకుముందే చారులద్వారా రాకుమారి చంద్రరేఖ అద్భుతమైన సౌందర్యాన్ని గురించి విని వున్నాడు.
ఆనాటివరకూ చదరంగం ఆటలో ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేని సూర్యతేజ, చదరంగం నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతడు చదరంగంలో పోటీలు నిర్వహించి, అందులో ప్రథముడిగా వచ్చిన విశ్వనాథుడు అనేవాడిద్వారా, చదరంగంలోని మెళుకువలు తెలుసుకోసాగాడు. ఈవిధంగా సూర్యతేజ ఆరునెలల పాటు చదరంగాన్ని కఠోరసాధన చేశాడు.
ఒకనాడు విశ్వనాథుడు, సూర్యతేజతో, “మీ శిక్షణ పూర్తయ్యింది, మహారాజా! నాకు సెలవిప్పించండి.” అన్నాడు.
సూర్యతేజ అతడికి విలువైన బహుమతులిచ్చి, చంద్రరేఖతో చదరంగం పోటీలో పాల్గొనేందుకు కనకపురికి బయలుదేరాడు.
కొంతమంది ప్రముఖ రాజోద్యోగులు, చంద్రరేఖ తల్లితండ్రుల సమక్షం లో చదరంగం పోటీ ప్రారంభమైంది. మొదటిసారిగా చంద్రరేఖ సౌందర్యాన్ని చూసి సూర్యతేజ చకితుడయ్యాడు. అందుకు కారణం, తన చారులు వర్ణించిన దానికంటే ఆమె గొప్ప సౌందర్యవతి.
పోటీ ఆసక్తికరంగా కొనసాగుతున్నది. చదరంగం బల్లమీద పావుల్ని ఇద్దరూ చక చకా కదుపుతున్నారు. సూర్యతేజ ఎంత నేర్పుగా ఆడినా, చంద్రరేఖ అమోఘ ప్రావీణ్యం ముందు నిలవలేకపోతున్నాడు. రెండు గడియలు గడిచే సరికి సూర్యతేజ రాజును, చంద్రరేఖ బందీ చేసింది. యువరాణి గెలిచినందుకు అందరూ హర్షధ్వానాలతో అభినందించారు. ఇద్దరు భటులు కొరడాలతో ముందుకు వస్తుంటే, యువరాణి సూర్యతేజకేసి జాలిగా చూసింది. ఇక సూర్యతేజ తన రాజ్యానికి బయలుదేరతాడని అంతా అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, సూర్యతేజ రెండోసారి పోటీలో పాల్గొనడానికి సిద్ధపడ్డాడు.
ఇది చూసి, “రెండోసారి యువరాణి వారి చేతిలో ఓడిపోతే, పాటించవలసిన నిబంధన ఏమిటో మీకు తెలుసుగదా! జీవితంలో మరొక స్త్రీని పెళ్ళిచేసుకొనని కులదైవం మీద ప్రమాణం చెయ్యాలి,” అని కనకపురి మహామంత్రి ఆదిత్యమల్లు, సూర్యతేజాను హెచ్చరించాడు.
“ఒకవేళ ఈ నిబంధన మీరు విధించకపోయినా, నేను మరొక స్త్రీని వివాహం చేసుకునే అవకాశం లేదు. మీ సంతృప్తి కోసం, మీరు కోరినట్లే ప్రమాణం చేస్తున్నాను,” అని సూర్యతేజ తమ కులదైవమైన పరమశివుడి మీద ప్రమాణం చేశాడు.
ఇప్పుడు రెండవసారి పోటీ ప్రా రంభమైంది. ఈ సారి సూర్యతేజ తన సర్వశక్తులూ ఒడ్డి ప్రతి ఎత్తు వేయసాగాడు. చంద్రరేఖ మాత్రం నల్లేరు మీద నడకలా చక చక ఎత్తులు వేస్తున్నది. ఆమె వేగానికి, నైపుణ్యానికి సూర్యతేజ అబ్బురపడసాగాడు. ఇంతలో ఒకసారి ఆమె సమ్మోహన రూపాన్ని చూస్తూ ఎదో పరధ్యానంలో ఉండి, ఒక లిప్తకాలం అతడి ఏకాగ్రత చెదిరింది. మంత్రిని జరపాలని అనుకుంటూనే ఏనుగుని జరిపాడు. ఆ దశలో అది కీలకమైన తప్పు. అంతే- ఒక అద్భుతమైన ఎత్తుతో చంద్రరేఖ, సూర్యతేజను ఓడించింది. మరొకసారి అందరూ ఆమెను గొప్పగా హర్షధ్వానాలతో అభినందించారు.
ఇప్పుడు సూర్యతేజ చారుశీలనగరానికి బయలుదేరడం ఖాయమని అంత భావించారు. అయితే, సూర్యతేజ మూడవసారి పోటీకి సిద్ధపడ్డాడు. అతడి మొండి పట్టుదలకు అంతా నివ్వెరపోయారు. రాజు జయకేతనుడు ముందుకు వచ్చి సూర్యతేజ భుజంమీద చెయ్యి వేసి, “రాజకుమారా! నువ్వు యువకుడివి, క్షాత్రవిద్యలలో ఆరితేరినవాడివి, ఎంతో భవిష్యత్తు ఉన్నవాడివి. ఒక రాజ్యపాలకుడిగా నీకేన్నో బాధ్యతలున్నాయి. అవన్నీ మరచిపోయి ప్రాణాన్ని పణంగా పెట్టి, ఈ పోటీలో పాల్గొనవద్దు. నామాట విని మీ రాజ్యానికి తిరిగి వెళ్ళు,” అని హితవు చెప్పాడు.
దానికి సూర్యతేజ మందహాసం చేసి, “నా క్షేమంకోరి మీరిచ్చిన సలహాకు కృతజ్ఞుణ్ణి. పెద్దలు జయాపజయాలు దైవాధీనాలంటారు గదా? ఈసారి నేను గెలవవచ్చు,” అన్నాడు.
ఈ సంభాషణ వింటున్న రాకుమారి, సూర్యతేజ పట్టుదలకు ఆశ్చర్యపోయింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి అతడు తనతో మరొకసారి పోటీకి సిద్ధాబడడం అపూర్వం అనిపించింది. ఆమె సూర్యతేజ కేసి ఒకటి రెండు క్షణాలు కన్నార్పకుండా చూసి, రాజు జయకేతనుడితో, “నాన్నగారూ! నేను ఈ పోటీలో ఓడినట్లు అంగీకరిస్తున్నాను!” అన్నది సిగ్గుతో తలవంచుకుంటూ.
పోటీని చూస్తున్న వారందరికీ ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. రెండుసార్లు సూర్యతేజ పై సులభంగా నెగ్గిన యువరాణి, ఇప్పుడు పోటీలో పాల్గొనకుండానే ఓటమిని అంగీకరించడం, వాళ్ళను అయోమయ స్థితిలో పడవేసింది.
రాజు జయకేతనుడు మాత్రం ఎదో అర్ధమైనవాడిలో తలపంకించి, “సరి ఆయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నావమ్మా!” అంటూ కుమార్తెను అభినందించాడు.
బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, సూర్యతేజ మొదటిసారి చదరంగం పోటీలో ఓడినప్పుడు, చంద్రరేఖతో తాను సరితూగలేనని గ్రహించి ఉండాలి. అలాకాక, తిరిగి రెండవ సారి, మూడవసారి పోటీకి సిద్ధపడడం మూర్ఖత్వం కాదా? ఏదో స్త్రీ సహజమైన జాలితో మూడవసారి యువరాణి పోటీకి దిగకుండానేా, తను ఓడినట్లు చెప్పబట్టి సరిపోయింది. అలా కానప్పుడు సూర్యతేజ ప్రాణాలు దక్కేవి కాదుగదా! ఇక, సరి అయిన సమయం లో సరి అయిన నిర్ణయం తీసుకున్నావని, రాజు జయకేతనుడు కుమార్తెను అభినందించడంలో సందర్భశుద్ధి ఉన్నట్లు కనిపించడంలేదు. ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “చదరంగంలో తను చంద్రరేఖకు సరిజోడుకాదని సూర్యతేజ, మొదటి ఆటలో ఓడినప్పుడే గ్రహించలేనంత మూర్ఖుడు కాదు. అయినా రెండవసారి, మూడవసారి ఆమెతో పోటీకి సిద్ధపడ్డాడంటే, అతడికి ఆమెపైగల గాఢమైన అనురాగాన్ని తెలియజేస్తుంది. ఈ సంగతి కుశాగ్రబుద్ధి గల చంద్రరేఖ గుర్తించడం ఏమీ కష్టం కాదు. నిజానికి చంద్రరేఖ తన స్వయంవరానికంటూ నిర్వహించిన చదరంగం పోటీ ఒక సాకు మాత్రమే. మూడు అంచెలుగా నిర్ణయించబడ్డ ఈ పోటీలో, సూర్యతేజ ఒక్కడే మొదటి రెండు అంచెలుదాటి, మూడవ అంచె పోటీకి తన ప్రాణాన్ని పణంగా పెట్టి సిద్ధపడ్డాడు. చంద్రరేఖ కోరుకున్నది సరిగ్గా అన్నిటా యోగ్యుడైన ఇటువంటి భర్తనే. తన ఆశ ఫలించిందని గ్రహించగానే, ఆమె తెలివితేటలతో వ్యవహరించి, తను ఓడినట్టు ప్రకటించింది. ఇందులో జాలి అంటూ ఏమీ లేదు. ఇది గ్రహించిన జయకేతనుడు కుమార్తె నిర్ణయాన్ని అభినందించాడు,” అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.
[ఆధారం: రాఘవరాజు పట్టాభిరామారాజు రచన]
Comments