పూర్వం శరశ్చంద్రికరాజ్యం రాజు చంద్రసేనుడి దగ్గర, శివదత్తుడనే యువకుడు గూఢచారిగా వుండేవాడు. వాడు రాజు పట్ల అచంచలమైన ప్రభుభక్తి కలవాడు. అప్పచెప్పిన పనిని సాధించడంలో తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని శివదత్తుడంటే, రాజుకు ప్రత్యేకమైన అభిమానం.
Mugguru Thyagulu Telugu Kids Story Bethala story in Telugu
శరశ్చంద్రిక రాజ్యానికి పొరుగు రాజ్యమైన మణిపుర రాజు ప్రచండుడు, కొంతకాలంగా శరశ్చంద్రిక రాజ్యాన్ని ఆక్రమించాలనే ఆలోచనలో వున్నాడు. ఈ సంగతి చంద్రసేనుడికి తెలిసింది. శత్రువు తమమీద దాడి చేసేలోపలే, తామే హఠాత్తుగా శత్రువు మీద దాడి చేయాలన్న ఆలోచన కలిగింది, చంద్రసేనుడికి. ప్రచండుడి సైనిక వివరాలు, అతడి కోటాలో ప్రవేశానికి ఏ మార్గం సుగమమో తెలుసుకురావడానికి, ఆయన శివదత్తుణ్ణి నియమించాడు.
శివదత్తుడు ఒక సామాన్య పౌరుడి వేషంలో బయలుదేరి, రహస్యంగా మణిపుర రాజ్యంలో ప్రవేశించాడు. అతడు చాలా చాకచక్యంతో మణిపుర సైనిక బలం గురించీ, కోట లోటుపాట్లు గురించీ తెలుసుకున్నాడు.
అతడు తను తెలుసుకున్న సంగతులు సాధ్యమైనంత త్వరగా చంద్రసేనుడికి చెప్పాలన్న ఉత్సాహంకొద్దీ, అరణ్యం గుండా అడ్డదారివెంట శరశ్చంద్రిక రాజధానికి బయలుదేరాడు.
శివదత్తుడికి హఠాత్తుగా, దారిపక్కన వున్న ఒక చెట్టు బోదెకు చేరగిలపడి కునికిపాట్లు పడుతున్న రాక్షసుడొకడు కనిపించాడు. వాణ్ణి చూసి నివ్వెరపోయిన శివదత్తుడు వేగంగా ముందుకు పరిగెత్తబోయేంతలో, రాక్షసుడు కళ్ళుతెరిచి, “ఆగు! నానుంచి నువ్వు తప్పించుకుని పారిపోలేవు. ఈ ఉదయాన్నే ఈ అరణ్య ప్రాంతానికి వచ్చిన నాకు దొరికిన మొట్టమొదటి మనిషివి నువ్వు!” అంటూ లేచి వచ్చి, శివదత్తుణ్ణి ఎడమచేతితో పట్టుకుని పైకెత్తాడు.
శివదత్తుడు వణికిపోతూ, “రాక్షసా! ఒక్క క్షణం ఆగి నేను చెప్పబోయేది విను. నా పేరు శివదత్తుడు. చంద్రసేనుడనే మహారాజు వద్ద గూఢచారిగా పనిచేస్తున్నాను. శత్రురాజుకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరించాను. అది మహరాజుకు త్వరగా అందజేయాలి . ఆ తర్వాత తిరిగివచ్చి నీకు ఆహరం అవుతాను,” అన్నాడు.
అందుకు రాక్షసుడు నవ్వి, “ఒకసారి వదిలితే మళ్ళీ నువ్వు, నాకు దొరుకుతావా? ఇంతకూ నువ్వు సేకరించిన సమాచారం ఏమిటి?” అని అడిగాడు.
“అది మహారాజుకు తప్ప మరెవరికీ చెప్పడం జరగదు,” అన్నాడు శివదత్తుడు.
రాక్షసుడిలా పంతం పెరిగి, “అది చెబితేనే నిన్ను వదులుతాను. లేకుంటే, ఈ క్షణానే తినేస్తాను,” అన్నాడు.
“అలాగే చెయ్యి,” అన్నాడు శివదత్తుడు తొణక్కుండా.
ఆ జవాబుకు రాక్షసుడు తృళ్ళిపడి, “ఆహాఁ, నిన్ను మెచ్చాను. రాజుకు చెప్పవలసిందేదో చెప్పి, త్వరగా తిరిగిరా,” అన్నాడు.
శివదత్తుడు, రాక్షసుడికి కృతఙ్ఞతలు చెప్పుకుని, వేగంగా నగరం చేరి, రాజు చంద్రసేనుడికి మణిపుర రాజ్యంలో తను సేకరించిన వివరాలన్నీ చెప్పాడు. ఆతర్వాత అక్కడనుంచి వెళ్ళేందుకు తొందరపడుతున్న శివదత్తుణ్ణి, కారణమేమిటని రాజు అడిగాడు.
శివదత్తుడు, రాక్షసుణ్ణి గురించి చెప్పి, “మహారాజా! మిమ్మల్ని ఒకే ఒక కోరిక కోరుతున్నాను. నా కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూడండి!” అని అక్కడినుంచి బయలుదేరి అరణ్యానికి పోయాడు.
శివదత్తుడి సత్యవ్రతానికీ, ప్రభుభక్తికీ పులకించిపోయిన చంద్రసేనుడు, మంత్రులకు రాజ్యానికిి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు చెప్పి — శివదత్తుడికి తెలియకుండా అతణ్ణి అనుసరించి అరణ్యం చేరాడు.
అన్నమాట ప్రకారం తనదగ్గరకు తిరిగి వచ్చిన శివదత్తుణ్ణి చూసి, రాక్షసుడు ఎంతగానో సంతోషించాడు. అయితే అంతలో రాజు చంద్రసేనుడు, రాక్షసుడి ముందుకు వచ్చి, “రాక్షసోత్తమా! శివదత్తుడి సత్యదీక్ష చూసావుగదా? అతను నా పనిమీద వుండగా, నీకంటబడ్డాడు. అందువల్ల, అతన్ని కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది. దయచేసి అతణ్ణి వదిలి నన్ను ఆహారంగా స్వీకరించు ,” అన్నాడు.
అదివిన్న శివదత్తుడు, “మహారాజా! నాబోటివాడు మరణిస్తే, నా కుటుంబానికి తప్ప మరెవరికీ నష్టం కలగదు. మీరు మరణిస్తే, రాజ్యమే అల్లకల్లోలమవుతుంది,” అని రాక్షసుడి కేసి తిరిగి, “నువ్వు నన్ను చంపి తినడమే న్యాయం,” అన్నాడు.
దానికి రాజు, “శివదత్తా! రాజ్యం గురించి ఏమీ భయం లేదు. నువ్వు రాజధాని చేరగానే మంత్రులు నిన్ను రాజుగా అభిషేకించే ఏర్పాట్లు చేసివచ్చాను. నీవంటివాడి పాలనలో ప్రజలు మరింత సుఖపడతారు,” అన్నాడు.
వాళ్ళ సంవాదం వింటున్న రాక్షసుడికి గొప్ప ముచ్చట వేసింది. వాడు, “ఇంతవరకు నన్ను చూసి భయంతో పారిపోయిన వాళ్ళనే చూశానుగాని, చావడానికి పోటీపడే వాళ్ళను చూడలేదు. అయితే ఒక సంగతి — నేను మీ ఇద్దర్నీ చంపి తింటానేమో అన్న అనుమానం మీక్కలగలేదా?” అని అడిగాడు.
అందుకు రాజు చిన్నగా నవ్వి, “నువ్వు శివదత్తుణ్ణి చంపక వదిలినప్పుడే, నీలో యుక్తాయుక్త విచక్షణ వున్న విషయం గ్రహించాను. అందువల్లనే నేను, నీ ముందుకు ఒంటరిగా వచ్చాను. అలాకానప్పుడు సైన్యంతో వచ్చి నీతో యుద్ధానికి పూనుకునే వాడిని,” అన్నాడు.
ఇందుకు రాక్షసుడు, రాజునూ మెచ్చుకుని, “సరే! ఇంతకూ నేను మీలో ఎవర్ని చంపి తినాలో తేల్చండి. నాకు చాలా ఆకలిగా వుంది,” అన్నాడు.
వెంటనే శివదత్తుడు, రాజుతో, “మహారాజా! మీరు చెప్పినట్లు నేను రాజ్య సంరక్షణభారం వహించలేను. అది నా శక్తికి మించిన పని. క్షమించి, మీరు రాజ్యానికి వెళ్ళండి,” అన్నాడు.
రాజు ఒక్కక్షణం ఆలోచించి, రాక్షసుడితో “నువ్వు మాలో ఎవర్ని ఆహరం చేసుకోవాలో తేల్చి చెప్పగలను. అయితే నువ్వు కాస్త ఓపిక పట్టాలి,” అన్నాడు.
“సరే! ఆహార విషయంలో ఎలాగో సర్దుకుంటాను. దాచక సంగతేమిటో తేల్చు!” అన్నాడు రాక్షసుడు.
“అయితే, విను! శివదత్తుడు రాజధానికి వెళ్ళి, సైన్యానికి నాయకత్వం వహించి, మణిపురి రాజు ప్రచండుడి మీదికి యుద్ధానికి వెళతాడు. శివదత్తుడు, ప్రచండుణ్ణి ఓడించగలిగితే, అతడే నా రాజ్యానికి రాజు అవుతాడు. నేను నీకు ఆహరం అవుతాను. ఆలా కాని పక్షాన నేను రాజ్యానికి పోతాను, శివదత్తుడు నీకు ఆహరం అవుతాడు,” అన్నాడు.
ఇందుకు రాక్షసుడు సమ్మతించి, “శివదత్తా! నువ్వు మారుమాట్లాడకుండా పోయి, రాజు చెప్పినట్టు చెయ్యి. నువ్వు తిరిగి వచ్చేంతవరకూ, రాజు నాదగ్గర బందీగా వుంటాడు,” అన్నాడు.
శివదత్తుడు, రాజు చంద్రసేనుడు చెప్పినట్లు రాజధానీ నగరం చేరి, సైన్యంతో బయలుదేరిపోయి, ప్రచండుడి కోటను ముట్టడించాడు. వరం రోజుల తర్వాత ప్రచండుడు, శివదత్తుడి చేతిలో ఓడిపోయాడు. అతడు శత్రురాజును బందీని చేసి చెరసాలలో వుంచాడు.
తర్వాత శివదత్తుడు, రాక్షసుడి దగ్గరకు తిరిగివచ్చాడు. అతడివెంట వున్న ఒక అందమైన యువతిని చూసి రాక్షసుడు, “ఎవరీ పిల్ల?” అని కుతూహలంగా అడిగాడు.
అందుకు శివదత్తుడు, “యుద్ధంలో నేను ప్రచండుణ్ణి ఓడించగలిగాను. ఈమె ప్రచండుడి కుమార్తె మందాకిని. ఈమె, మా మహారాజును ప్రేమించింది. వివాహమాడితే, శరశ్చంద్రిక రాజునే వివాహమాడతానని ప్రతిన పూనింది,” అన్నాడు.
ఈ జవాబుకు రాక్షసుడు ఆశ్చర్యపోతూ, “అయితే ఇప్పుడేం చేద్దాం?” అని అడిగాడు.
“మహారాజు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈమెకు మనోవ్యధ కలిగించడం న్యాయం కాదు. మహారాజును వదిలి నన్ను ఆహరం చేసుకో,” అన్నాడు శివదత్తుడు.
రాక్షసుడు, రాజు చంద్రసేనుడితో, “రాజా! విన్నావుగదా. నీవేమంటావు?” అన్నాడు.
చంద్రసేనుడు అయిష్టంగా, “నా ప్రమేయంలేని ఆమె ప్రేమకు నేనెలా బాధ్యుణ్ణి? నేను ముందే చెప్పిన విధంగా, ప్రచండుణ్ణి ఓడించిన మరుక్షణం నుంచీ, శరశ్చంద్రిక రాజు శివదత్తుడే! మందాకిని ప్రతిన పట్టింది శరశ్చంద్రిక రాజునే వివాహమాడతానని కాబట్టి, ఆమెను శివదత్తుడు వివాహమాడితే సమస్య తీరిపోతుంది,” అన్నాడు.
వెంటనే మందాకిని, రాక్షసుడితో, “రాక్షసోత్తమా! ఇదంతా నేనూహించనిది. నా దృష్టిలో శరశ్చంద్రిక రాజును వివాహమాడడమంటే, చంద్రసేన మహారాజును వివాహమాడడమే. మహారాజు ఆడిన మాట తప్పని సత్యసంధుడు. ఆయన అన్న ప్రకారం శివదత్తుణ్ణి విడిచి, ఆయనతో పాటు నన్ను కూడా ఆహారంచేసుకో. మహారాజుతో ఎలానూ కలిసి జీవించలేను, కనీసం కలిసి మరణించే పరమివ్వు!” అన్నది.
రాకుమారి మందాకిని మాటలు విన్న రాక్షసుడు నిర్ఘాంతపోయి, ఒక్క క్షణం తన ఎదుట వున్న ముగ్గురుకేసి పరీక్షగా చూసి, “ఇంత కాలంగా నేను, మానవులందరూ శారీరికంగానే కాక, మానసికంగా కూడా అత్యంత బలహీనులనుకునే వాణ్ణి. స్వార్ధం, పరపీడన, ఓర్వలేనితనం మూర్తీభవించిన అల్పజీవులుగా వాళ్ళు నాకు కనిపించేవాళ్ళు. ఇప్పుడు మీ ముగ్గురినీ చూస్తూంటే — ప్రభుభక్తీ, భృత్యుడి పట్ల ఆదరణా, ప్రేమానురాగాలూ, మనిషిని ఎంత ఉన్నతుణ్ణీ, దైవాంశకలవాణ్ణీ చేయగలవో అర్థమవుతున్నది. ఇందువల్ల నేను, తన రాజు కోసం ఆత్మార్పణకు సిద్ధపడిన శివదత్తుడి వంటి ప్రభుభక్తి పరాయణుడినీ, ఒక సేవకుడి రక్షణ కోరి ప్రణాలివ్వడానికి వెనుకాడని రాజు చంద్రసేనుడి వంటి త్యాగనిరతుణ్ణీ, ప్రేమించిన వాడికోసం బలి కావడానికి సంసిద్ధురాలైన యువతినీ — ఈ ముగ్గురిలో ఎవర్ని చంపినా, అది అతిహేయమైన కార్యమవుతుంది. నేను సంతోషంగా మీ ముగ్గురినీ విడిచిపెడుతున్నాను. ఈక్షణానే ఈ అరణ్యాన్ని వదిలి దూరతీరాలకు వెళ్ళిపోతున్నాను,” అంటూ ఆకాశంలోకి ఎగిరి క్షణాలమీద అదృశ్యుడయ్యాడు.
బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, శివదత్తుడి ప్రవర్తన గురించి మనసులో నాకు కొన్ని సందేహాలున్నాయి. నిజంగానే అతడు అంత గొప్ప ప్రభుభక్తి పరాయణుడైతే, ప్రచండుడి చేతిలో ఓడిపోయి వుండవచ్చు. అప్పుడు, రాజు చంద్రసేనుడు రాక్షసుడికి ముందు వాగ్దానం చేసిన విధంగా , శివదత్తుడు రాక్షసుడికి ఆహారమై వుండేవాడు. కానీ అలా చేయక సర్వశక్తులూ ఒడ్డి ప్రచండుణ్ణి ఓడించాడు, శివదత్తుడు. రాజు, రాక్షసుడితో అన్న ప్రకారం, ఈ పరిస్థితుల్లో రాజు రాక్షసుడికి ఆహారమైపోవాలి! యుద్ధంలో గెలిచాక, యువరాణి మందాకిని ప్రసక్తి వచ్చి వుండకపోతే, శివదత్తుడు రాజై, చంద్రసేనుణ్ణి రాక్షసుడికి ఆహారంగా వదిలిపోయే వాడేగదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “వీరుడూ, ప్రభుభక్తి పరాయణుడైన వాడెప్పుడూ, తన క్షేమాన్ని కాక, ముందు రాజ్య క్షేమాన్ని చూస్తాడు. ప్రచండుడి చేతిలో ఓడితే, రాజ్య ప్రతిష్ట మంట కలుస్తుంది. అందువల్లనే శివదత్తుడు, శత్రురాజును సర్వశక్తులూ ఒడ్డి ప్రాణానికి తెగించి ఓడించాడు. అయితే, ఇందువల్ల తన రాజు, రాక్షసుడికి ఆహరం అయ్యే ప్రమాదం వున్న మాట నిజం. కానీ శివదత్తుడు అప్పటివరకూ రాక్షసుడి ప్రవర్తనను సూక్ష్మంగా పరిశీలించి వుండడంతో — అతడికి రాక్షసుడిలో అంతో ఇంతో దయాగుణం, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం వున్నట్టు గ్రహించాడు. అటువంటి వాడు కేవలం తన ఆకలి తీర్చుకునేందుకు ఎవరినీ చంపడు. ఆ కారణంగానే శివదత్తుడు, శత్రురాజును ఓడించేందుకు పూనుకున్నాడు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు రాజు చంద్రసేనుడు, తన భృత్యుడి ప్రభుభక్తి విషయంలో ఏమాత్రం పొరపాటు చేయలేదని రుజువవుతున్నది,” అన్నాడు.
రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు. — (కల్పితం)
[ఆధారం : ఎన్. శివనాగేశ్వరరావు రచన ]
Comments