pravaktha telugu lo stories kathalu ప్రవక్త

pravaktha telugu lo stories kathalu ప్రవక్త 
ప్రవక్త
——-
ఇస్లాం మతం ప్రభవిస్తున్న రోజులు అవి. మహమ్మద్ ప్రవక్త ఇంకా చిన్నవాడే. మక్కాలో ఇంకా ఆయనకు పేరు ప్రఖ్యాతులు అంతగా ఏర్పడలేదు. భగవంతుని వాక్యం ఆయనకు అందుతున్నది- కొద్దిమంది ఆయనను అనుసరించటం మొదలు పెట్టారు అప్పుడప్పుడే.

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన- ఒకనాడు ఆయన సమీపంలోని ఒక గ్రామం నుండి మక్కా వైపు నడచిపోతున్నాడు. రోడ్డు మీద ఆయనకు ముందుగా ఒక ముసలమ్మ- తనుకూడా మక్కావైపుకే- నడచిపోతున్నది. ఆమె తలమీద బరువైన మూట ఒకటి ఉన్నది. చూడగా అది ఆమె వయసుకు మించిన బరువని తోచింది ముహమ్మద్ కు.
ఆయన వేగంగా నడచి ఆమెను చేరుకొని, ఆమెకు సాయం చేస్తానన్నాడు. మూట తనకు ఇమ్మనగానే, ఆమె సంతోషంగా తన బరువును ఆయనకు అందించింది.ఇక ఇద్దరూ కలిసి నడవసాగారు. ముసలమ్మకు ఈ కుర్రవాడు నచ్చాడేమో, అవీ-ఇవీ అన్నీ మాట్లాడుతూ నడుస్తున్నది. ఆ రోజుల్లో అందరూ చెప్పుకునే కబుర్లలో ముఖ్యమైనది “ముహమ్మద్ – అతని కొత్త మతం” అట! ఆ సంగతి కూడా ముసలమ్మ చెప్పగా తెలిసింది ముహమ్మదుకు.
ముసలమ్మ అన్నది- “కొడుకా, నువ్వు కూడా విని ఉంటావు, ఈ కుర్రాడి గురించి- పేరు ముహమ్మదట. అతను నేరుగా అల్లాతోటే మాట్లాడతానంటున్నాడట. అల్లా ఆయనకు దివ్య జ్ఞానాన్ని నేరుగా అందిస్తున్నాడంటాడట. అదేగనక జరిగితే అతన్ని ప్రవక్త అనాలి. నాకైతే ఇదేదో పెద్దమోసం అనిపిస్తున్నది. అంత చిన్నవాడు, ఎంతలేసి మాటలు మాట్లాడుతున్నాడో చూడు. ఇది ఎలా సాధ్యం, చెప్పు? అతను కొంచెం పెద్దవాడైయుంటే, కొంచెం చదువుకున్నవాడై ఉంటే- ఎవరైనా అతని మాటల్ని పట్టించుకొని ఉండేవాళ్లు. కానీ అతనికి ఆ వయసూ లేదు; అంత చదువూ లేదు!”
ముహమ్మదు వింటూపోయాడు, ఏమీ అనకుండా. కుర్రవాడు శ్రద్ధగా వింటున్నాడని నిర్ధారించుకున్నాక, ముసలమ్మ ఇంకా కొనసాగించింది.
“నాకు అస్సలు నచ్చని సంగతల్లా మనకు మన పూర్వీకుల నాటినుండీ వచ్చిన మతం పట్ల అతనికున్న చిన్నచూపు. వాళ్లందరి కంటే తెలివైన వాడా ఇతను?! అన్ని విగ్రహాలనూ, అన్ని గుర్తులనూ విడిచిపెట్టెయ్యాలని బడబడ వాగుతున్నారు అతన్ని అనుసరించేవాళ్లు- కానీ మనం అట్లా చేస్తే ఎట్లా ఉంటుందో ఊహించుకో, ఒకసారి! మక్కాకు ఇక యాత్రీకులన్నవాళ్లే రారు. మన వ్యాపారమంతా నాశనం అయిపోతుంది. వాళ్ల మతాచారాల మూలాన మన జీవనం గడుస్తున్నది. ఆ ఆచారాలే లేని రోజున మనం బాధలు పడాల్సివస్తుంది. ‘మనం ఒకే నిజమైన అల్లాను ప్రార్థించాలి, వేరే వాళ్లని వదిలి పెట్టెయ్యాలి- అంటాడతను. కానీ జనాలు వేర్వేరు దేవుళ్లను పూజించుకుంటే ఏమి నష్టం? వాళ్లు ఎన్నో తరాలుగా అదే పని చేస్తున్నారు- చేయట్లేదా, నువ్వేచెప్పు!”
కుర్రవాడు శ్రద్దగా వింటున్నాడని గమనించిన ముసలమ్మ. ఇప్పుడు అతనికి సలహాలివ్వటం మొదలు పెట్టింది. “చూడు నాయనా! జాగ్రత్త ! నీ బాగు కోరి చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండు. గమనించుకో. ముహమ్మదు మతం కుర్రవాళ్లలో చాలా వేగంగా విస్తరిస్తున్నది. నన్నడిగితే వీళ్లంతా కుర్రకారును తప్పుదోవ పట్టిస్తున్నారు”
కుర్రవాడు ఇస్లాంకు మద్దతుగా ఏమీ అనకపోవటంతో అతను ముస్లిం కాడని భావించింది ముసలమ్మ. దాంతో ఆమెకు ధైర్యం హెచ్చి, వ్యక్తిగా ముహమ్మదుపైన చెలరేగుతున్న పుకార్లను మసాలాతో సహా వివరించటం మొదలుపెట్టింది.
ఆసరికి వాళ్లిద్దరూ పట్నం చేరుకున్నారు. ముహమ్మదు ఆమె ఇంటి గడపమీద బరువును దించిపెట్టి, ఇక వెళ్లేందుకు శలవుకోరుతూ వంగి సలాం చేశాడు. ఈ దయగల, మంచి, మర్యాదస్తుడైన కుర్రవాడంటే ముసలమ్మకు ఇష్టం ఏర్పడ్డది. కుర్రవాడి తలమీద చెయ్యిపెట్టి ఆమె అతన్ని ఆశీర్వదించింది.
కుర్రవాడు వెనుతిరగగానే అతని పేరేమిటో కూడా అడగలేదని తట్టిందామెకు- “నాయనా! నీ పేరేంటి, ఇంతకీ?” అన్నది.
“ముహమ్మద్” అన్నాడు కుర్రవాడు.
ముసలమ్మ నిర్ఘాంతపోయింది. ఆపైన కొంతసేపు ఆమె తను అంత వ్యతిరేకంగా మాట్లాడినందుకు నొచ్చుకోవద్దనీ, క్షమించమనీ వేడుకున్నది.
ముహమ్మదు ఆమెకు సాంత్వన వచనాలు పలికి, ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నదీ తనలో పంచుకున్నందుకు గాను ధన్యవాదాలు అర్పించాడు. తనేమీ నొచ్చుకోలేదనీ, ఆమె చెప్పిన విషయాలన్నీ తనకు ఎంతో ఉపయోగపడేవేననీ చెప్పాడు ముసలమ్మకు.
ముసలమ్మకు ముహమ్మదు ఇంకా చాలా నచ్చాడు. ఆపైన ముహమ్మదు పట్లా, ఇస్లాం పట్లా ఆమె భావనలో పరివర్తన వచ్చింది.
కొంత కాలానికి ఆమె కూడా ముహమ్మదు బాటలో నడిచింది!
Spread the love

Leave a Reply

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.