Rakumari Thondara Paatu , Telugu Bethala Kathalu for Kids, రాకుమారి తొందరపాటు
రాకుమారి తొందరపాటు
Rakumari Thondara Paatu , Telugu Bethala Kathalu for Kids,
పూర్వం ఒకసారి తూర్పు సముద్ర తీరపు కొండ ప్రాంతాల ఎడతెరిపి లేని వర్షపాతంతో పాటు పెను తుఫాను గాలులు చెలరేగినై. ఆ సమయం లో కూలిపోయిన కొండ చరియల్లో ఒక చోట, అతి ప్రాచీనమైన శివాలయం ఒకటి బయల్పడింది. ఈ వార్త ఆ ప్రాంతాన్ని పాలించే స్వర్ణపురి రాజు శూరవర్మకు తెలియవచ్చింది.
శూరవర్మ కుమార్తె సులక్షణ గొప్ప శివ భక్తురాలు. ఆమె, తండ్రితో,
“నాన్నగారూ! తుఫాను తాకిడికి బయల్పడిన ఆ పురాతన శైవాలయం, మన రాజధానికి అతి సమీపంలోనే వుండడం మన అదృష్టం. నా పర్యవేక్షణ లో అక్కడ నాలుగైదు మాసాల్లో శివుడికి అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మిస్తాను,” అన్నది అమితానందంగా.
శూరవర్మ తన అంగీకారం తెలిపాడు. మంచి ముహూర్తాన శివాలయపునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమైనది. సులక్షణ రోజులో చాలా భాగం పనివాళ్ళకూ, శిల్పులకూ సూచనలిస్తూ, ఆ కొండా వద్దనే గడిపేది.
ఒకరోజు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటున్న ఆమెకు, అతి మనోహరమైన మురళీగానం దూరం నుంచి వినవచ్చింది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఆమె గానం వస్తున్నా దిశగా వెళ్ళింది. ఒకచోట పచ్చిక మైదానం లో కొన్ని గొర్రెలు మేస్తున్నవి. పాతికేళ్ళ యువకుడొకడు ఒక చెట్టు కింద కళ్ళు మూసుకు కూర్చుని తన్మయత్వంతో మురళిని వాయిస్తున్నాడు. అతడి అందం చూసి సులక్షణ అమితాశ్చర్యం చెందింది.
పాట పూర్తి చేసి కళ్ళు తెరిచిన యువకుడు, ఎదురుగా నిలబడి ఉన్న సులక్షణను చూసి ఉలిక్కి పడ్డాడు. ఆమె చిన్నగా నవ్వి, “నేను రాకుమారి సులక్షణను. నీ మురళి పాటను మెచ్చాను. నీ పేరేమిటి?” అని అడిగింది.
“నా పేరు గోవిందస్వామి!” అని ఆ యువకుడు, సులక్షణకు నమస్కరించి గొర్రెలను తోలుకుని వెళ్ళిపోయాడు.
అది మొదలు సులక్షణ రోజూ రహస్యంగా గోవిందస్వామిని కలుసుకుని, మురళి మీద తనకు నచ్చిన పాటలు పాడించుకునేది. గోవిందస్వామి ఆమెకు మురళి వాయించడం నేర్పేవాడు. ఆమె అతడికి నాగరికపు ప్రవర్తనా, ఎదుటివారితో మాట్లాడవలసిన తీరూ నేర్పేది. నెల తిరిగేసరికి ఇద్దరూ చాలా సన్నిహితులయ్యారు.
ఒకనాడు కొద్దిసేపు మురళి వాయించగానే సులక్షణకు పొలమారి దగ్గు వచ్చింది. అది చూసి గోవిందస్వామి, ఆమెతో, “ఇక్కడికి దగ్గరలోనే చిన్నతనం నుంచి నేనెరిగిన అవ్వ వున్నది. ఆమె గుడిసె వెనుక వున్న బావినీళ్ళు కొబ్బరిబోండాం నీళ్ళలా తియ్యగాఉంటాయి,” అని, సులక్షణను కొండ మలుపులో బాట పక్కనేవున్న అవ్వ గుడిసె దగ్గరకు తీసుకువెళ్లాడు.
చుట్టూ పచ్చని చెట్లతో, పూలమొక్కలతో పర్ణశాలలా వున్న అవ్వగుడిసె చూసి సులక్షణ ఆశ్చర్యపోయింది. కాళ్ళ సవ్వడి విని గుడిసె లోంచి బయటికి వచ్చిన అవ్వ, సులక్షణను చూసి, “ఎవరమ్మా నువ్వు? ఏమనుకోకు. మా గోవిందు అందానికి దీటైన అందగత్తెను ఇన్నాళ్ళకు చూశాను,” అన్నది బోసినోటితో నవ్వుతూ.
ఇది విన్న సులక్షణకు సిగ్గు ముంచుకువచ్చింది. గోవిందస్వామి చెప్పగా అవ్వ గుడిసెలోకి పోయి, ఒక లోటాలో నీళ్లు తెచ్చి సులక్షణకు ఇచ్చింది. సులక్షణ నీళ్ళుతాగి, అవ్వతో, “నీ గుడిసె ముందు నేనేనాడూ ఎరగని కమ్మని పూలవాసన, అవ్వా! ఇక్కడ నాకెంతో హాయిగా వున్నది,” అన్నది.
“ఇది పొగడ పూల సువాసన!” అంటూ అవ్వ కిందరాలిన పొగడ పూలు ఏరి దండ గుచ్చి, ఎంతో సంతోషంగా సులక్షణ తలలో తురిమింది.
ఆ తర్వాత గోవిందస్వామి, ఆమెను వెంటబెట్టుకుని కొండ మలుపు దాకా వచ్చి, అక్కడ దిగవిడిచి గొర్రెలను తోలుకునివెళ్ళిపోయాడు. ఆ రోజే తను పెళ్ళంటూ చేసుకుంటే గోవిందస్వామినే చేసుకోవాలని సులక్షణ నిర్ణయించుకున్నది.
ఆరాత్రి ఆమె మందిరంలోకి రాజు శూరవర్మ వచ్చి, “అమ్మా! ఉదయగిరి యువరాజు మణిదత్తుడు నిన్ను వివాహమాడదలచినట్టుగా వర్తమానం పంపించాడు. అతడు అన్ని విధాలా తగినవాడో కాదో చూడాలి గదా. అందువల్ల, రెండు రోజుల పాటు మన అతిధిగా గడిపి వెళ్ళమని ఆహ్వానం పంపించాను. అతను రేపు సాయంకాలానికి నగరానికి వస్తాడు,” అని చెప్పాడు.
ఆ సమయంలో, గోవిందస్వామి ప్రస్తావన తండ్రి ముందుతీసుకురావడానికి సులక్షణకు ధైర్యం చాలలేదు.
మరునాటి మధ్యాహ్నం సులక్షణ, గోవిందస్వామికి సంగతి చెప్పి, “ఆ యువరాజు మణిదత్తుడికి నేను నచ్చి తీరుతాను. ఒకవేళ తొందరపడి, మానాన్న అతడికి మాట ఇస్తే, ఆ తర్వాత దానికి తిరుగుండదు,” అన్నది దిగులుగా.
“అవ్వను సలహా అడుగుదాం పద!” అన్నాడు గోవిందస్వామి.
ఇద్దరూ అవ్వగుడిసెకు వెళ్ళారు. సులక్షణ, అవ్వకు జరిగింది చెప్పి, “మా నాన్న నా ఇష్టాన్ని కాదనడు. గోవిందస్వామి అన్ని విధాలా మా నాన్నకు నచ్ఛుతాడనే నమ్మకం నాకున్నది. అయితే, గోవిందస్వామిని మా నాన్న దగ్గరకు తీసుకువెళ్ళే ధైర్యం నాకు లేదు,” అన్నది.
అవ్వ కొంచెం సేపు ఆలోచించి, “ఇందులో మనం భయపడవలసిందీ, మతులు చెడగొట్టుకోవలసిందీ ఏమి లేదు. గోవిందస్వామి, గోవిందస్వామిగా కాక, యువరాజు మణిదత్తుడుగా వెళ్ళి మీ నాన్నను కలుసు కుంటాడు. గోవిందుడు మీ నాన్నకు నాచుతాడనే నమ్మకం నీకున్నది కదా! ఇకనేం, కథ సుఖాంతం,” అన్నది.
ఉదయగిరి యువరాజు నగరం చేరాలంటే, కొండా వారగా వున్న మార్గం తప్ప మరొక మార్గం లేదు. అతను తన గుడిసె ముందుకు రాగానే ఏం చేయాలో, గోవిందస్వామికి వివరించింది అవ్వ.
అనుకున్నట్టుగానే, సాయంత్రానికి తెల్లని అశ్వం మీద రాచదుస్తుల్లో మణిదత్తుడు ఆ ప్రాంతానికి వచ్చాడు.
అవ్వ అతడికి ఎదురుపోయి, “నాయనా, నాగన్నా! నా మాటవిను. భోజనం చేసివెళ్ళు,” అంటూ గుర్రానికి అడ్డుగా నిలబడి దుఃఖం నటించింది.
ఇది విని మణిదత్తుడి చాలా ఆశ్చర్యపోతూ, “అవ్వా! నేను నువ్వనుకునే నాగన్నను కాదు; ఉదయగిరి యువరాజు మణిదత్తుణ్ణి!” అంటూ గుర్రం మీద నుంచి కిందకి దిగాడు.
అక్కడేఉన్న గోవిందస్వామి, మణిదత్తుణ్ణి పక్కకు తీసుకుపోయి, “అయ్యా! ఈ అవ్వ ఒక్కగానొక్క మనవడు నాగన్న. వాడు రాజు గారి సైనికుడు. ఎన్నో ఏళ్ళ నాడు పొరుగు రాజు ఈ రాజ్యం మీద దండెత్తాడు. రాజాజ్ఞగా దండోరా వింటూనే- భోజనం చేస్తున్న నాగన్న, అవ్వ ఎంత బతిమాలినా వినకుండా, గోడకు వేళ్ళాడుతున్న కత్తి తీసుకుని బయటికు పరిగెత్తాడు. అప్పుడు జరిగిన యుద్ధం లో వాడు మరణించాడు. అవ్వకు మతి చలించింది. మీలో నాగన్న పోలికలుండి వుండాలి! ఈపూట అవ్వ వడ్డించగా భోజనం చేస్తే, ఈ ముసలితనంలో ఆమెకు ఎంతో తృప్తి కలిగించినవారవుతారు,” అని ఒక కట్టుకథ కల్పించి చెప్పాడు.
జాలీ, దయాగుణం గల మణిదత్తుడు వెంటనే అవ్వ భుజం మీద చెయ్యివేసి, “అవ్వా! నన్నాకలి దహించేస్తున్నది. అన్నం పెట్టు,” అన్నాడు.
అవ్వ వెంటనే అతడికి అన్నం, కూరలు వడ్డించింది. మణిదత్తుడు ఇష్టం లేకపోయినా తృప్తి న్తటిస్తూ భోజనం ముగించి, దాపులవున్న మంచం మీద కూర్చున్నాడు. అవ్వ అతడికి ఒక లోటాలో వేడి పాలు తెచ్చి ఇచ్చింది. ఆ పాలు తాగి మణిదత్తుడు క్షణాల మీద నిద్రలోకి జారుకున్నాడు.
అప్పుడు అవ్వ, గోవిందస్వామితో, “ఆ పాలల్లో కొన్ని మూలికల రసం కలిపాను. యువరాజు కు రేపు సాయంకాలానికి గాని స్పృహ రాదు. నువ్వు, ఈయన దుస్తులు ధరించి అశ్వం మీద రాజభవనానికి వేళ్ళు,” అన్నది.
గోవిందస్వామి, మణిదత్తుడుగా రాజభవనంలో ప్రవేశించాడు. అందమైన నిలువెత్తు గోవిందస్వామి రూపం రాజు శూరవర్మ ను ఆకట్టుకుంది. ఆయన, కుమార్తెతో, “నువ్వు అదృష్టవంతురాలివి, తల్లీ! నీ కాబోయే భర్త అచ్చు మన్మథుడిలావున్నాడు,” అంటూ, ఆమె తల నిమిరాడు.
సులక్షణ పరమానంద భరితురాలైంది. మర్నాడు సాయంత్రం నదిలో నౌకావిహారానికి ఏర్పాట్లు చేసాడు శూరవర్మ.
విహారానికి బయలుదేరే ముందు ఒక పరిచారిక సులక్షణ మందిరంలోకి వచ్చి, “అమ్మా! మీకోసం ఎవరో ముసలిది పొగడ పూలదండ తెచ్చింది. దాన్ని స్వయంగా తనే మీకివ్వాలని పట్టుబడుతున్నది,” అనిచెప్పింది.
పొగడదండ వింటూనే, ఆ వచ్చినదెవరూ గ్రహించిన సులక్షణ, పరిచారికతో ఆ ముసలిదాన్ని లోపలి పంపించమన్నది. అవ్వ వస్తూనే, “రాకుమారీ! ఆ యువరాజుకు ఒళ్ళు కాలిపోయే జ్వరం వచ్చింది. విరుగుడు మందు ఇచ్చినా స్పృహ రాలేదు. నువ్వు ఆస్థాన వైద్యుడను తీసుకుని వెంటనే రావాలి,” అన్నది ఆందోళనగా.
అవ్వను పంపేసి, సులక్షణ ఉద్యానవనంలో తిరుగుతున్నా గోవిందస్వామిని కలుసుకుని జరిగింది చెప్పి, “నేను నౌకావిహారానికి రాను. వైద్యుణ్ణి వెంటబెట్టుకుని అవ్వఇంటికి వెళుతున్నాను,” అని చెప్పింది.
“ఆ యువరాజుకు తీవ్రజ్వరం, స్పృహ లేదంటూ నువ్వు గొడవ పడిపోవడం ఆశ్చర్యంగా వుంది! ఏమైనా, నువ్వు నౌకావిహారానికి రాకపోతే ఏమి బావుండదు,” అన్నాడు గోవిందస్వామి నిరుత్సాహంగా.
సులక్షణ మౌనంగా అక్కడినుంచి బయలుదేరి, రాజవైద్యుణ్ని వెంటబెట్టుకుని అవ్వ గుడిసెకు వెళ్ళింది.
వైద్యుడు స్పృహలేని స్థితిలో ఉన్న మణిదత్తుడి నుదుటికి ఏవో లేపనాలు పట్టించి, “రోగికి ఒకటి రెండు గంటల్లో స్పృహ వస్తుంది, భయపడవలసిందేమి లేదు. తర్వాత ఈ రెండు మాత్రలూ మింగించమ్మా,” అని సులక్షణకు చెప్పాడు.
తరువాత ఆయన ఈ జరిగిందంతా వింతగానూ, అనుమాస్పదంగానూ తోచడంతో, సరాసరి రాజు శూరవర్మకు దగ్గరకు పోయి సంగతంతా వివరించాడు.
వెంటనే శూరవర్మ కొద్ది పరివారాన్నీ, రాజవైద్యుణ్ణి తీసుకుని అవ్వ గుడిసెకు వచ్చాడు. ఆ సమయంలో మణిదత్తుడు కొంత స్పృహ రావడంతో మెల్లగా ఎదో మాట్లాడుతున్నాడు.
సులక్షణ కన్నీళ్ళు తుడుచుకుంటూ శ్రద్ధగా వింటున్నది.
శూరవర్మ, ఏమిటిదంతా అన్నట్టు కుమార్తెకేసి చూశాడు. ఆమె, తండ్రి చేయి పట్టుకుని పరివారం నుంచి దూరంగా తీసుకుపోయి, జరిగిందంతా పూస గుచ్చినట్టు చెప్పి, “నా ప్రోద్బలం మీద గోవిందస్వామి యువరాజు వేషంలో మన భవనానికి వచ్చాడు. హఠాత్తుగా అనారోగ్యం పాలయి యువరాజు ఇక్కడ చిక్కుపడ్డాడు,” అన్నది.
శూరవర్మకు, గోవిందస్వామి అన్నివిధాలా నచ్చివుండడంతో, ఆయన కుమార్తెపై కోపగించుకోక, “ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అన్నివేళలా సత్ఫలితాలనివ్వవు. ముందు నువ్వు మణిదత్తుడికి క్షమాపణలు చెప్పుకో! నువ్వు గోవిందస్వామిని వివాహమాడేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు,” అన్నాడు.
“క్షమించండి, నాన్నగారూ! నా తొలి నిర్ణయం తొందరపాటు వల్ల జరిగిందని గ్రహించాను. నేను మణిదత్తుడికి క్షమాపణ చెప్పుకుంటాను. కాని అది, గోవిందస్వామిని వివాహమాడేందుకు మాత్రం కాదు; మణిదత్తుణ్ణి వివాహమాడేందుకే! నా కాబోయే భర్త భవిష్యత్తులో ఈ రాజ్యానికి రాజవుతాడు. ప్రజాక్షేమం, రాజ్యరక్షణా అన్నిటికన్న ముఖ్యం కదా!” అన్నది సులక్షణ.
బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, రాకుమారి సులక్షణకు మొదట్లో, తను గోవిందస్వామిని వివాహమాడడం, తన తండ్రికి ఇష్టం కాదేమో అన్న భయం వున్నది. కాని, అతణ్ణి విఆహమాడేందుకు తండ్రి తన పూర్తి ఇష్టాన్ని తెలియబరిచాడు. అయినా, ఆమె గోవిందస్వామిని నిరాకరించి, మణిదత్తుణ్ణి వివాహమాడగోరడం అవివేకంగానూ, అసందర్భంగానూ లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “గోవిందస్వామి స్వయం ఆలోచనాశక్తి లేనివాడు, పైపెచ్చు స్వార్థపరుడు. ముక్కూ ముఖం ఎరగని ఒక ముసలిదాన్ని సంతృప్తి పరిచేందుకు మణిదత్తుడు, తను రాజభవనానికి వెళ్లడం కూడా వాయిదా వేసుకున్నాడు. దీనిని బట్టి అతడిది ఎదుటివారి కష్టాలకు చలించే జాలి గుండె అని తెలుస్తున్నది. ఇది ప్రజాపాలకుడైనవాడికుండవలసిన ప్రధాన లక్షణం. ఇక, గోవిందస్వామి మనస్తత్వం ఇందుకు పూర్తిగా విరుద్ధం. అతడు తను స్వార్ధం కొద్దీ అల్లిన కట్టుకథ కారణంగా, మణిదత్తుడు అస్వస్థుడై స్పృహ కోల్పోయిన స్థితిలో వున్నాడని తెలిసీ చలించలేదు. పైగా, రాకుమారి సులక్షణను తనతో పాటు నౌకావిహారానికి రావలసిందిగా కోరాడు. అటువంటి స్వార్ధపరుడు, దయా, జాలీ అంటే ఏమిటో తెలియనివాడు తన భర్త అయి, ఆ తర్వాత దేశానికి రాజయితే ప్రజలు ఎన్ని ఇక్కట్లకు గురవుతారో సులక్షణ గ్రహించింది. అందుకే, ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుణ్ణి వివాహమాడదలిచింది. ఇది ఎంతో వివేకమంతమైన సందర్భోచిత నిర్ణయం,” అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవం తో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.
— (కల్పితం)
[ఆధారం: మాచిరాజు కామేశ్వరరావు రచన]