కవిపండితులు పోటీ – విక్రమ బేతాళ కథలు
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి , చెట్టు పై నుంచి శవాన్ని దించి భూజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, ఎంతో శ్రమతో కూడిన యింత కఠిన కార్యానికి, నిన్నెవరు ప్రోత్సహించారో నాకు తెలియదు.
కార్యసాఫల్యం తరువాత నీకు లభించబోయేవేమిటి ?
సంపదలా ? కీర్తా ?
లేక యీ రెంటిని ఆశిస్తున్నావా ?
ఒకే వ్యక్తి యీ రెండింటికీ అర్హుడు కావడం చాలా అరుదైన సంగతి. వివేకి అయినవాడు, ఈ రెంటిలో ఏ ఒకదాని కోసం మాత్రమే, తన యావచ్ఛక్తినీ వినియోగిస్తాడు. ఆలా కానప్పుడు ఒక్కొక్కసారి నలుగురి లో అవహేళన పాలు కావలసి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా నీకు, ఇద్దరు కవిపండితుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ యిలా చెప్పసాగాడు:
ఒకానొకప్పుడు ప్రసన్నుడనే కవి, తన కవిత్వాన్ని వినిపించి రాజాశ్రయం సంపాదించాలని పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు. అప్పుడు పాటలీపుత్రాన్నేలుతున్న మహాసారుడు సాహితీ ప్రియుడని పేరు. ప్రసన్నుడు రాజదర్శనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని, రాజభటులు ఆటంకం కారణంగా అవన్నీ తన బాధను ఒక రత్నాలవ్యాపారికి చెప్పుకున్నాడు.
వ్యాపారి అంతా విని, “నాకు రత్నాల విలువ మాత్రమే తెలుస్తుంది; కవిత్వం విలువ తెలియదు. నీకు రాజదర్శనం యిప్పించగల శక్తి నాకు లేదు. రాజభటులకు ఏ లంచమో యిచ్చి మంచిచేసుకుని, రాజదర్శనం సంపాయించుకో” అని చెప్పాడు.
ఆ మాటలకు ప్రసన్నుడు ఆవేశపడి ఆశువుగా ఒక పద్యం చెప్పాడు. ఆ పద్య భావం ఏమంటే — రాజభటులకు లంచం యిచ్చిన కవుల కవిత్వం వినే రాజుకు , తన కవిత్వం వినిపించకపోవడమే మంచిదని.
రత్నాల వ్యాపారికి ఆ పద్యం అర్థం కాకపోయినా, అప్పుడే ఆ దుకాణంలో రత్నాలు కొనేందుకు అడుగు పెట్టిన దేవీదాసు విన్నాడు. ఆయన మహాసారుడి ఆస్థానకవి. ఆయన నోరు విప్పితే సరస్వతి పలుకుతుందని అందరు చెప్పుకుంటారు. పండిత, పామరులను సరిసమానంగా రంజింపచేయగల దేవీదాసును, ఆ రాజ్యంలో అందరు ఎంతగానో గౌరవిస్తారు.
దేవీదాసును చూస్తూనే రత్నాల వ్యాపారి సాదరంగా ఆహ్వానించాడు. దేవిదాసు, వ్యాపారికి తానెవరైంది చెప్పవద్దన్నట్టు సైగచేసి, ప్రసన్నుడి వంక చూసి, “తమరు చూడబోతే మహాకవుల వలె వున్నారు. రాజదర్శనానికి తమరు రాజభటులను కాక, రజ్జస్థాన కవులను ఆశ్రయించవలసింది.” అన్నాడు.
ఈ సలహాకు జవాబుగా ప్రసన్నుడు మరొక పద్యం చదివాడు. ప్రసన్నుడి కవిత్వం విన్న రాజు, అంతవరకూ తను సారహీనమైన కవిత్వం విన్నట్టు గ్రహించి తన ఆస్థాన కవులను తొలగించి, వారి స్థానంలో ప్రసన్నుడిని నియమిస్తాడు. ఆ భయంతో రాజాస్థాన కవులెవ్వరూ, ప్రసన్నుడికి రాజదర్శనం చేసే అవకాశం యివ్వరని — ఆ పద్యం భావం.
దేవీదాసు వెంటనే చిన్నగా చప్పట్లు కొట్టి, “మీ కవిత్వం చాలా గొప్పగా వున్నది. కాని, మహాసారుడి ఆస్థాన కవుల గురించి, మీకెవరో తప్పుసమాచారం యిచ్చారు. నేనే, మీకు రాజదర్శనం కలిగించగలను.” అని తను ఎవరైనది అతనికి చెప్పాడు.
ప్రసన్నుడు కంగారు పడిపోతూ, “తమరెవరో తెలియక నోటికి వాచినట్టు మాట్లాడేశాను. నాకు, మీరంటే గురు భావం వున్నది!” అన్నాడు.
“అతిశయోక్తి కవిత్వంలో అలంకారమే గదా !” అని దేవీదాసు, ప్రసన్నుణ్ణి వెంటబెట్టుకుని మహాసురుడి వద్దకు తీసుకువెళ్లి, తనకు ప్రసన్నుడితో ఎలా పరిచయం అయినదీ ఆయనకు చెప్పాడు.
మహాసారుడు ఆనందంగా, “దేవీదాసు మెప్పు పొందారంటే, తమరు చాలా గొప్ప కవులయి ఉండాలి.” అని ప్రసన్నుడి కవిత్వం విని మెచ్చుకుని, తన ఆస్థాన కవుల్లో ఒకడుగా చేర్చుకున్నాడు.
ఇలా వుండగా, ఆ దేశంలోని ప్రజల్లో మతకలహాలు చెలరేగాయి. ప్రజలు వీరశైవులని, వీరవైష్ణవులనీ, బౌద్ధులనీ, జైనులనీ తెగలు తెగలుగా విడిపోయి ఒకరిపై ఒకరు హింసాకాండ జరుపుకోసాగారు. ప్రజల ఆలోచనల్లో మార్పు రావడం కోసం మహాసారుడు ఏన్నో ప్రయత్నాలు చేశాడు. కాని, ఫలితం కలగలేదు.
అప్పుడు మహాసురుడి మంత్రి ఆయనతో, “ప్రభూ , మంచి పుస్తకాలే ప్రజల ఆలోచనలను మార్చగలవు. పరమత్మ ఒక్కడే అని వేదాలు ఘోషిస్తున్నవి. వేదాలను అందరు గౌరవిస్తారు గదా! వేదసారాన్ని వ్యావహారిక భాషలో వివరించగలిగితే, ప్రజల ఆలోచనాధోరణిలో మార్పు వస్తుంది.” అన్నాడు.
రాజు మహాసారుడికి, యీ సలహా నచ్చింది. ఈ పని చేయడానికి దేవీదాసు మాత్రమే సమర్థుడని, ఆయనకు తోచింది. కాని, మంత్రి మాత్రం, “వేద సారాన్ని వ్యావహారిక భాషలో వివరించగలగడం ఒక్కరికి సాధ్యపడే పని కాదు. ప్రసన్నుడు కూడా దేవీదాసు అంతటి వాడని విన్నాను. మీరీ బాధ్యతను యిద్దరికీ అప్పగించండి.” అని చెప్పాడు.
మహాసారుడు ఈ కవులిద్దరినీ పిలిపించి, మంత్రి చెప్పినది వివరించాడు.
అందుకు ప్రసన్నుడు, “వేదసారాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ముందు అది మనకు అర్థం కావాలి. ఇది ఒక్కరివల్లా, ఇద్దరివల్లా అయే పని కాదు. మహాపండితులతో చర్చలు జరిపి, అటుపైన కావ్యరచనకు పూనుకోవాలి.” అన్నాడు.
దేవిదాసు మాత్రం, “ఈ విషయమై నాకు ఎవ్వరి సాయము అవసరంలేదు. నేనొక్కడినీ, యీ కార్యాన్ని పూర్తి చేయగలను. నాకు రెండు మాసాల గడువు కావాలి.” అని రాజును అడిగాడు.
మహాసారుడు వెంటనే ఆ కార్యభారాన్ని యిద్దరు కవులకు అప్పగించి, “ఎవరు కావ్యాన్ని ముందు పూర్తిచేస్తే, వారికి లక్ష వరహాల బహుమానం యిస్తాను.” అని చెప్పాడు.
వెంటనే కవులిద్దరూ తమ తమ ప్రయత్నాలు ప్రారంభించారు.దేవీదాసు సంస్కృతంలో మహాపండితుడు. ఎంతటి క్లిష్టతరమైన విషయమైనా, ఆయనకిట్టే అర్థమైపోతుంది. ఆ విధంగా అయన వేదాలను మననం చేసుకుని వ్యావహారిక భాషలో కావ్యాన్ని తయారుచేయసాగాడు.అనుకున్న దానికంటే రెండు వారాల ముందే,దేవీదాసు కావ్యరచన ముగిసింది.
ప్రసన్నుడికి సంస్కృతం అర్థమవుతుంది గాని, ఆ భాషలో ప్రావీణ్యం లేదు. అతడు కొందరు వేదపండితులను ఆశ్రయించి, కావలసిన విషయాలన్నీ అర్థం చేసుకుని, కావ్యరచనకు ఉపక్రమించాడు. ఇందువల్ల అతడికి కావ్యం పూర్తి చేయడానికి రెండు మాసాలు పట్టింది.
దేవీదాసు ఎప్పటికప్పుడు, ప్రసన్నుడి కావ్యరచన ఎలా సాగుతున్నదీ యితరుల ద్వారా తెలుసుకుంటూనే వున్నాడు. ప్రసన్నుడి కంటే తను కావ్యాన్ని ముందు రాయడం ఒక ఘనతగా అయన భావించలేదు. ప్రసన్నుడు తన కంటే మెరుగ్గా రాయలేడని అందరికి రుజువుకావాలి!
ఇలాంటి ఆలోచనలతో దేవీదాసు, ప్రసన్నుడి కావ్యరచన పూర్తి అయ్యేవరకూ ఆగి, రాజుదగ్గరకు పోయి, “మహాప్రభూ! నేనూ, ప్రసన్నుడూ ఒకే సమయంలో కావ్యరచన పూర్తి చేశాం. వీటిలో ఉత్తమమైన రచనకు బహుమతి యివ్వండి.” అని చెప్పాడు.
ఇది మహాసారుడికి గడ్డు సమస్యగా పరిణమించింది. ఉత్తమ రచనలు ఎన్నిక చేయడానికి ఆయన సామాన్యంగా దేవీదాసు సాయం తీసుకునేవాడు. ఇప్పుడు దేవీదాసు రచనకే పోటీ వచ్చిందంటే, న్యాయనిర్ణేతగా ఎవరుంటారు?
ఇలాంటి సమయంలో మహాసారుడి అదృష్టమో అన్నట్టు — చిరంజీవి అనే సకల విద్యాపారంగతుడు, దేశ సంచారం చేస్తూ పాటలీపుత్రానికి వచ్చాడు. మహాసారుడు ఆయనకు సాదరంగా ఆహ్వానించి, తన సమస్య చెప్పుకుని, న్యాయనిర్ణేతగా ఉండవలసింది కోరాడు.
చిరంజీవి రెండు కావ్యాలను శ్రద్ధగా పఠించి, రెండూ ఉత్తమంగా ఉన్నవనీ, ఇద్దరు కవులూ బహుమతికి అర్హులని చెప్పాడు.
ఆ మాట వింటూనే దేవీదాసు, “నా కావ్యం, నా ఒక్కడి ప్రతిభా ఫలితం! నేను, ప్రసన్నుడి కంటే రెండు వరాలు ముందే ముగించినా, అతడిక్కూడా అవకాశం యిచ్చెందుకు రెండు వారాలు ఆగాను. ప్రసన్నుడు వేదసారాన్ని గురించి పలువురితో చర్చించి, అప్పుడు కావ్యాన్ని రచించాడు. బహుమతి అర్హతను నిర్ణయించే ముందు, మీరు ఈ విషయం మర్చిపోకూడదు.” అన్నాడు.
చిరంజీవి ఆశ్చర్యంగా, “నీ ఒక్కడినే వేదసారాన్ని ఆరు వారాల్లో యింత అద్భుతంగా వ్యావహారిక భాషలో కావ్యంగా మలిచావా ? నమ్మ శక్యంకావడంలేదు.” అన్నాడు.
అందుకు దేవీదాసు, “ఇంతకంటే అద్భుతాలు నేను చేశాను! ఒకే సంవత్సరంలో మహాభారతాన్ని, రెండు సంవత్సరాలలో అష్టాదశ పురాణాలనూ, నేనొక్కణ్ణే వ్యావహారిక భాషలో అనువదించాను.” అన్నాడు.
అయన చెప్పింది నిజమే నన్నాడు మహాసారుడు .
“అలాంటప్పుడు, ఆరు వారాల్లో వేదసారాన్ని కావ్యంగా రాయడం ముగించి నందుకు, వెంటనే బహుమతి ఎందుకడగలేదు? ఇప్పుడిది నా దాకా ఎందుకు తీసుకువచ్చారు?” అని అడిగాడు.
“కావ్యలక్షణాలు క్షుణ్ణంగా ఎరిగిన వారెవరైనా, న కావ్యానికి, ప్రసన్నుడి కావ్యానికీ వున్న భేదం సులభంగా తెలుసుకోగలరు. ముందుగా రాశానని కాకా, అద్భుతమైన గొప్ప కావ్యం రాసినందుకు బహుమతి తీసుకోవాలనుకున్నాను.” అన్నాడు దేవీదాసు.
“ఈ విషయంలో, నీ అభిప్రాయం ఏమిటి?” అని చిరంజీవి ప్రసన్నుణ్ణి అడిగాడు.
“ఆర్యా, నాకు, దేవీదాసు లాగా సంస్కృతం లో పాండిత్యం లేదు. ఆ విధంగా నేనయానకంటే ఎప్పుడు చిన్నవాడినే. నేను బహుమతికోసంకాక, ప్రజలకు పనికి రావాలని, ఈ కావ్యరచనకు పూనుకున్నాను. నా కావ్యంతో సరిసమానంగా ఉన్నదంటే, నేను అంత ఎత్తుకు ఎదిగానా అని ఎంతో ఆశ్చర్యంగా వున్నది . దేవీదాసు నాకు ఎప్పుడు గురుతుల్యులు!” అన్నాడు ప్రసన్నుడు.
చిరంజీవి వెంటనే బహుమతి మొత్తాన్ని ప్రసన్నుడికివ్వవలసిందిగా మహాసారుడికి చెప్పాడు. ఆయన అలాగే చేశాడు.
బేతాళుడు యీ కథ చెప్పి, “రాజా, చిరంజీవి చేసిన నిర్ణయాన్ని, రాజు మహాసారుడు అంగీకరించిన కారణంగా, మహాకవీ, పండితుడూ అయిన దేవీదాసుకు తీరని అన్యాయం జరిగిపోయింది కదా ! ఈ విషయం లో చిరజీవి పక్షపాత బుద్ధికి అసలు కారణం ఏమిటి? అతడు దేవీదాసుకన్నా తక్కువ ప్రతిభ గల ప్రసన్నుణ్ణి ఎందుకు అభిమానించినట్టు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో, నీ తల పగిలిపోతుంది .” అన్నాడు .
దానికి విక్రమార్కుడు, “దేవీదాసు ఉత్తమ కవి అనడంలో సందేహంలేదు. కాని, ప్రసన్నుడు కూడా పోటీకి నిలిచిన కావ్యం ద్వారా అతడి స్థాయినందుకున్నాడు. అందువల్ల, యిప్పుడు యిద్దరూ సరిసమానులు. అలాంటప్పుడు బహుమతి ఎవరికివ్వాలి?
ఇద్దరు కవులనూ పరిశీలించిన మీదట ఒక సంగతి స్పష్టమవుతున్నది. దేవీదాసు తన ప్రతిభను పొగడుకోవడమే కాక, తనను మించిన కవి లేడని అహంకరిస్తున్నాడు. అది పతనానికి సూచన! బహుమతి తనకు వచ్చి తీరాలన్న అతడి పట్టుదల చూస్తుంటే, అతడికి కీర్తి దాహంతోపాటు, ధనదాహం కూడా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. అలాంటివాడు జీవితంలో దిగజారడం తప్ప, ఒక్క మెట్టు కూడా పైకిపోలేడు.
ఇకపోతే, ప్రసన్నుడిలో యింకా వినయ గుణం వున్నది. అంటే , అతడు యింకా కొత్త ఎత్తుల్ని చేరుకోగల అవకాశం వున్నది. సరిసమాన స్థాయిలో వున్న యిద్దరు కవులతో… పతనానికి సిద్ధంగా వున్న కవికిగాక, ఇంకా పైస్థాయికి పోగల కవికి బహుమానం యివ్వడం న్యాయం అనిపించుకుంటుంది . చిరంజీవి ఆ పనే చేశాడు. అతడిలో పక్షపాత బుద్ధి ఏ మాత్రం లేదు.” అన్నాడు .
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు .
Vikrama Bethala Katha | విక్రమ బేతాళ కథలు | Kavi Pandithula Poti – కవిపండితులు పోటీ
— (కల్పితం)
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, friendship story, friendship kathalu
Comments