దివ్యశక్తుల పరీక్ష- Divya Shaktula Pareeksha Bethala Kathalu –
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, ఒక దేశపాలకుడుగా, నీకున్న కీర్తి ప్రతిష్ఠలేమిటో నాకు తెలియవు. రాజైనవాడికి ధర్మ గుణం, పరాక్రమం, తెలివితేటలూ వున్నంత మాత్రాన చాలదు. వాటికి తోడు సూక్ష్మ బుద్ధీ , మనోస్థైర్యం అవసరం. ఆ రెండూ నీలో లోపించిన కారణంగానే, ఈ అర్థరాత్రి వేళ ఎదో అసాధ్యమైన కార్యాన్ని సాధించబూని, ఈ శ్మశానంలో తిరుగుతున్నావని, నాకు అనుమానం కలుగుతున్నది. రాజు మాధవసేనుడి లాగా, కొందరు తాము చేయని నేరానికీ, పాపానికీ తమకుతామే శిక్ష విధించుకుంటారు. ఇందుకు కారణం సూక్ష్మ బుద్ధీ, మనోస్థైర్యం లేకపోవడం. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను, విను.” అంటూ ఇలా చెప్పసాగాడు :
Divya Shaktula Pareeksha Bethala Kathalu
ఒకానొకప్పుడు కొసలదేశాన్ని, మాధవసేనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వాడు. ప్రజాక్షేమాన్ని కాంక్షించడంలో ముల్లోకాలలోను ఆయనకు ఆయనే సాటి అని పేరు వచ్చింది.
ఇలా ఉండగా — కొసలదేశంలో అగ్నినేత్రుడనే మాంత్రికుడు ప్రవేశించాడు. వాడు క్షుద్రవిద్యలతో సామాన్య పౌరులను భయపెట్టి తన పనులు చక్కబెట్టుకోసాగాడు. ఆవిధంగా వాడొక పెద్ద భవనం నిర్మించుకుని, సకలసదుపాయాలతో, సుఖంగా జీవిస్తూ ప్రజలను వేధించసాగాడు. ప్రజలకు వాడంటే విపరీతమైన భయం. అందుచేత , ఎవరూ వాడిని గురించి రాజుకు ఫిర్యాదు చేయలేదు.
గూఢచారుల ద్వారా మాధవసేనుడికి, అగ్నినేత్రుణ్ణి గురించి తెలిసింది. అయన వెంటనే కబురు పంపి వాణ్ణి కొలువుకు రప్పించాడు.
అగ్నినేత్రుడు, మాధవసేనుడికి సవినయంగా నమస్కరించి, “నీ రాజ్యం లో ప్రజలూ , నేను కూడా ఎంతో సుఖంగా జీవిస్తున్నాం. నీకు నా వందనాలు.” అన్నాడు.
మాధవసేనుడు శాంతంగా, “నీ వినయం నాకు సంతోషాన్ని కలిగించింది. నువ్వు వెంటనే, నా రాజ్యం వదిలి వెళ్ళిపోతే నేనింకా సంతోషిస్తాను.” అన్నాడు.
“నావంటి మహా మాంత్రికుడు ఏ దేశంలో ఉంటే, ఆ దేశానికి ఎంతో గౌరవం. నన్ను నీవు పొమ్మనడానికి కారణం ఏమిటి ?” అని అడిగాడు అగ్నినేత్రుడు.
“నీ బుద్ధి మంచిది కాదు. నువ్వు స్వార్థపరుడివి. నా రాజ్యంలో నీవంటి వారికి స్థానం లేదు. నువ్వు నీ దుష్టశక్తులతో సామాన్యులను బాధించి, వేధించి సుఖాలు అనుభవిస్తున్నావు.” అన్నాడు మాధవసేనుడు.
దీనికి బదులుగా అగ్నినేత్రుడుపెద్దగా నవ్వి, “శక్తిమంతుడు, శక్తిహీనుడి కంటే ఏక్కువ సుఖపడడం ఏ దేశంలోనైనా జరిగేదే! నువ్వు విధించే పన్నులు ప్రజలు సంతోషంగా చెల్లిస్తున్నారంటావా? నీ శాసనాలన్నీ వాళ్లకు నచ్చుతున్నాయంటావా? ప్రజలు నా మీద ఫిర్యాదు చేయడం లేదు కాబట్టి, నేనూ మంచి వాణ్ణే! ఇక స్వార్థం అంటావా? ప్రజలకంటే ఎక్కువ వైభవంగా జీవిస్తూ సుఖపడుతున్న నువ్వు మాత్రం, స్వార్థపరుడివి కాదా? అందుకని నువ్వు దేశం వదిలి పోతావా?” అని ప్రశ్నించాడు.
“రాజా భవనాల్లో నివసించడంలో సంప్రదాయం తప్ప, ఎక్కువ సుఖం లేదు. నేను స్వార్థపరుడినని నువ్వు రుజువు చేస్తే, నేను ఈ క్షణమే రాజ్యం వదిలిపోతాను!” అన్నాడు మాధవసేనుడు.
అగ్నినేత్రుడు వికటాట్టహాసం చేసి, “నీతో నాకు వాదనలేమిటి? అకారణంగా నన్ను రాజ్యం వదిలిపోమన్నావు. నేను నీ కుమార్తెను, నాతో తీసుకుపోతాను. ఎం చేయగలవో చేయి.” అంటూ అక్కణ్ణుంచి మాయమయ్యాడు.
అంతే! అదే సమయంలో మాధవసేనుడి ఏకైకపుత్రిక మాధవీలత, అంతఃపురం నుంచి మాయమయ్యింది.
మహారాజు మాధవసేనుడికి ఏం చేయాలో పాలుబోలేదు. అప్పుడు మంత్రి ఆయనతో, “ప్రభూ ! మాధవీలతకు తగిన వరుణ్ణి ఎన్నిక చేయాలనుకుంటున్నారు కదా! ఇప్పుడు దీన్నొక అవకాశంగా తీసుకుందాం. ఏ వీరుడు మాంత్రికుణ్ణి చంపి రాజకుమారిని రక్షిస్తాడో , ఆ వీరుడికి మీరు రాజ్యాన్ని, యువరాణిని కూడా సమర్పించవచ్చు.” అన్నాడు.
మాధవసేనుడు చేసేది లేక ఇందుకు అంగీకరించాడు. వెంటనే రాజ్యంలో, ఆ విధంగా చాటింపు వేయబడింది. రాజ కుమార్తెనూ, రాజ్యాన్ని తమదిగా చేసుకోవాలని ఎందరో యువకులు ఉత్సాహంగా బయల్దేరారు.
ఈలోగా మాధవసేనుడు కూడా ఊరుకోలేదు. ఆయన అంతఃపుర భూగృహంలోని మహాదేవి ఆలయానికి వెళ్ళి , “పరాక్రమంతో దుష్టుల నెదిరించగలను. దుష్టశక్తుల నెదిరించడానికి నా శక్తి చాలదు. నువ్వే సాయపడాలి.” అని దేవిని ప్రార్థించాడు.
అప్పుడు దేవి ప్రత్యక్షమై, “రాజా, నిన్ను కొన్ని దివ్యశక్తులు పరీక్షకు గురి చేస్తున్నాయి. దిగులు పడకు. నేను నీకొక ఖడ్గాన్ని యిస్తున్నాను. అది తాకగానే దుష్టశక్తి ఎంత బలమైనదైన బూడిదగా మారిపోతుంది.” అని ఒక ఖడ్గాన్ని ఆయనకిచ్చి మాయమయ్యింది.
మాధవసేనుడు ఆ ఖడ్గాన్ని ఒరలో ఉంచుకొని, ఆ రాత్రికి సుఖంగా నిద్రపోయాడు. ఆలా వరం రోజులు గడిచే సరికి, ఒక రోజున మాధవీలత అపూర్వ తేజంతో విరాజిల్లే అందమైన యువకుడితో తిరిగి వచ్చింది.
ఆ యువకుడు మాధవసేనుడుకి వంగి నమస్కరించి, “నేను అగ్నినేత్రణ్ణి చంపి, మాధవీలతను రక్షించి తీసుకువచ్చాను. నా పేరు అగ్నిసేనుడు. మా పూర్వీకులు విదేహరాజ్యాన్నేలేరని చెప్పుకుంటారు.” అని తన గురించి చెప్పుకున్నాడు.
మాధవసేనుడు మారు మాట్లాడకుండా, తన ఒరలోంచి కత్తి దూసి,అగ్నిసేనుణ్ణి తీవ్రంగా తాకాడు. ఆయన ఈ విపరీత ప్రవర్తనకు చుట్టూ వున్నవారు మాధవీలతతో సహా అందరు ఆశ్చర్యపోయారు. అగ్నిసేనుడికి రవంత గాయం కూడా కాలేదు. అతడు నవ్వుతూ నిలబడ్డాడు.
మాధవసేనుడు మారు మాట్లాడకుండా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. అగ్నిసేనుడికీ మాధవీలతకూ వివాహం జరిగింది.
వివాహానంతరం అగ్నిసేనుడికి రాజ్యాభిషేకం జరిగింది. అప్పుడు అగ్నిసేనుడి రూపం లో ఉన్నట్లుండి అగ్నినేత్ర మాంత్రికుడిగా మారిపోయింది. వాడు నవ్వుతూ, “యువరాణిని నేను వివాహమాడాలనుకున్నాను. ఈ దేశానికి రాజును కావాలని కలకన్నాను. ఈ రెండు కోర్కెలూ తీర్చుకునేందుకు, నా శక్తుల్ని ఉపయోగించుకున్నాను. ముందు మాధవీలతను అపహరించాను. ” అన్నాడు.
మాధవసేనుడు కొంచెంసేపు ఆలోచిస్తూ వూరుకుని, “అగ్నిసేనా, నువ్వు మాములు క్షత్రియ యువకుడివి, నన్ను పరీక్షించడానికి, ఏవో దివ్యశక్తులు నిన్ను ఉపయోగించుకున్నాయి. మాంత్రిక వేషంతో ఎవరిని భయపెట్టకు. కోసలకు ప్రభువుగా చక్కని రాజ్యపాలన చెయ్యి. ఈ పరీక్షలో నేనోడిపోయాను. పాపపరిహారార్థం నేను కొంత కాలం వనవాసానికి వెళ్లి తపస్సు చేసుకుని వస్తాను.” అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఆ మరుక్షణం మాంత్రికుడు రూపంలో ఉన్నవాడికి, ఆ రూపం పోయి అగ్నిసేనుడుగా మారిపోయాడు.
బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా,మాధవసేనుడు తాను పాపం చేశానంటూ వనవాసానికి పోవడం, అర్థం లేని పని కాదా? అతడు ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించాడు. వాళ్లకు మరొక మంచి ప్రభువునిచ్చాడు. ఇన్ని చేసి, అతడు పాపపరిహారం, తపస్సూ అదనడం , బుద్ధి లోపం, మనోస్థైర్యం కోల్పోవడం వల్లనే, కదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తలా పగిలి పోతుంది.” అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “మాధవసేనుడు తాను పాపం చేశాననడం, నువ్వు చెప్పిన కారణం వాల్ల కాదు. అతడు పాపం చేసినమాట నిజం. రాజ్యం అతడి బాధ్యత తప్పితే సొంత ఆస్తి మాత్రం కాదు. సమర్థులకు మాత్రమే అప్పగించాలి. అసమర్థుడికో అప్పగిస్తే, అందువల్ల ప్రజలు నష్టాలకు గురవుతారు. ఇవన్నీ ఆలోచించక కన్నకూతురిపై మమకారంతో స్వార్థబుద్ధితో ఎవరు తన కుమార్తె ను రక్షిస్తే వారికి రాజ్యం కట్టబెడతాననడం, మాధవసేనుడు చేసిన మొదటి పాపం. కులదేవత అద్భుతశక్తులగల ఖడ్గాన్నిచ్చి, దివ్యశక్తులు కొన్ని నిన్ను పరీక్షకు గురిచేస్తున్నావని అతణ్ణి హెచ్చరించింది. అయినా, మాధవసేనుడు ఆ హెచ్చరికను తోసిపుచ్చి, అగ్నిసేనుడి మీద ఖడ్గాన్ని ప్రయోగించాడు. ఇది రెండవ పాపం. ఇవన్నీ గుర్తించే అతడు వనవాసానికి పోవడం జరిగింది.” అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలుగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.
— (కల్పితం)
[ఆధారం: “వసుంధర ” రచన]
Comments