గురుదక్షిణ – మాతృదక్షిణ – – బేతాళ కథలు
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, అర్ధరాత్రి వేళ, భీతగొలిపే ఈ స్మశానంలో, తల పెట్టిన కార్యం సాధించేందుకు, దృఢ సంకల్పంతో నువ్వు చేస్తున్న ధైర్య సాహసాలు మేచ్చుదగినవే. అయితే వాటితో పాటు మనిషికి లోకజ్ఞత, సమయస్ఫూర్తి, లక్ష్య శుద్ధి ఎంతో అవసరం. అవి లేనివాడు కార్యం సిద్ధించే తరుణంలో దాన్ని చేజేతులా జారవిడవడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణంగా సునందుడనే వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను” అంటూ ఇలా చెప్ప సాగాడు:
– పూర్వం విరూపదేశానికి బృహస్పతి లాంటి బుద్ధిశాలి అయిన మంత్రి వుండే వాడు. మహారాజు శూరసేనుడు ప్రతి విషయానికి మంత్రి మీదనే ఆధార పడేవాడు. ఆయన పాలనలో దేశం సుభిక్షంగా వుంది. దురదృష్టవశాత్తు మహామంత్రి అకాల మరణానికి గురయ్యాడు. శూరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకుని, ఆయన సలహాలతో రాజ్య పాలన చేయ సాగాడు.
Gurudakshina_1
కొత్త మంత్రికి రాజును మెప్పించడం బాగా తెలుసు కానీ, సలహాలివ్వడం బొత్తిగా చేత కాదు. అయినా తనకు తోచిన సలహాలిస్తూంటే రాజ్యపాలన అస్తవ్యస్తంగా సాగింది. కొందరు రాజుకీ విషయం చెబితే ఆయన అంగీకరించి, “మంత్రి సలహా తోనే రాజ్యం సుభీక్షంగా వుంది. మంత్రి అన్నవాడు తప్పుడు సలహాలివ్వలేదు. రాజ్యంలో ఇబ్బందులు వస్తే అవి తాత్కాలికం,” అన్నాడు.
చివరకు రాజగురువు కూడా శూరసేనుడిని, మంత్రి సలహాల గురించి హెచ్చరించాడు. రాజు నవ్వి, “గురువర్యా! తమకు దేవకార్యాల గురించి తెలిసినట్లు రాజకార్యాల గురించి తెలియదు. పాత మంత్రి సలహాలను కూడా ఆరంభంలో కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. కొత్త మంత్రి సలహాల గొప్పతనం, కొద్ది కాలంలోనే అందరూ అర్ధం చేసుకుంటారు” అన్నాడు.
Gurudakshina_2అందుకు రాజగురువు ఏమి అనలేక పాత మంత్రి ఇంటికి వెళ్ళాడు. పాత మంత్రి భార్య ఆయనకు నమస్కరించి ఉచితాసనం చూపించింది. రాజ గురువు ఆమెను ఆశీర్వదించి, “అమ్మాయీ! మహారాజు శూరసేనుడు, నీ భర్త వల్ల బాగా ప్రభావితుడైనాడు. కానీ నీ భర్త మంత్రి స్థానాన్ని ఇప్పుడొక మూర్ఖుడు ఆక్రమించాడు. వాడు తన తప్పుడు సలహాలతో దేశానికి హాని కలిగిస్తున్నాడు. మెచ్చుకోలు కబుర్లతో రాజుని మెప్పించి, తన స్థానం పటిష్థం చేసుకున్నాడు. కేవలం మంత్రి సలహాలపైనే ఆధార పడడం, ఏ రాజుకూ మంచిదికాదని శూరసేనుడు గ్రహించలేకపోతున్నాడు. ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు. కాని నువ్వు దేశానికొక ఉపకారం చేయాలి. నీ కుమారుడు సునందుడికిప్పుడు పదేళ్ళ వయసు గదా! చండకారణ్యం లోని వితండుడి గురుకులాశ్రమానికి వాణ్ని పంపు. వితండుడు నీ కుమారుడిని విచక్షణ జ్ఞానం గల మహా మంత్రిగా తీర్చి దిద్దుతాడు. నీ కుమారుడు విద్య ముగించుకుని తిరిగి వచ్చేవరకూ, మన దేశానికి మోక్షం లేదు,” అన్నాడు.
పాత మంత్రి భార్య అందుకు సరేనని అలాగే చేసింది. పదేళ్ళ వయసులో సునందుడు, తల్లిని విడిచి చండకారణ్యం చేరుకున్నాడు.
Gurudakshina_3
అక్కడ వితండుడు, వాణ్ణి చూసి విషయమడిగి తెలుసుకుని, “గురుకులానికి జ్ఞాన సముపార్జన కోసం రావాలి. మంత్రి పదవిని ఆశించి రాకూడదు. అయినా నీకింకా పదవి గురించి ఆలోచించే వయసు రాలేదు.” అన్నాడు.
నునందుడు వితండుడికి నమస్కరించి, “గురువర్యా! నా తండ్రి మంచి సలహాలతో మహారాజుకు సాయ పడిన మాట నిజం. ఆ విధంగా దేశానికి ఉపకారం జరిగింది. కానీ నా తండ్రి కారణంగా రాజుకు మంత్రి సలహాలన్నీ మంచి సలహాలేనన్న దురభిప్రాయం కలిగింది. అది తొలగించాల్సిన భాద్యత నాది. సమర్థుడైన మంత్రి, రాజులో విచక్షణా జ్ఞానాన్ని పెంచుతాడు తప్ప, అన్నింటికీ తనపై ఆధారపడేలా చేయడు. నా తండ్రి చేసిన తప్పును సవరించడం కోసమే నేను తమ వద్దకు వచ్చాను.” అన్నాడు.
వితండుడు, సునందుణి దీవించి, “నీలో గొప్ప తెజస్సుంది. నీ మాటలు వయసుకు మించిన తెలివిని సూచిస్తున్నాయి. నిన్ను సకల శాస్త్ర పారంగాతుడిని చేసి, నా తర్వాత ఈ గురుకులాన్ని నీకి అప్పగించాలనిపిస్తోంది. అయితే, నీ అభిప్రాయం కూడా న్యాయమైనదే! కానీ ఒక్క విషయం గుర్తుంచుకో! కేవలం ఉద్యోగం, పదవిని ఆశించి చదివేవాడు, జీవితంలో ఎందుకూ కొరగాకుండా పోతాడు.” అన్నాడు.
సునందుడు వినయంగా తలవంచి ఊరుకుని, ఆ రోజే విద్యాభ్యాసం ప్రారంభించాడు. వితండుడు వాడికి అన్నీ నేర్పుతూనే రాజరికం, మత్రంగాల గురించి కూడా వివరిస్తుండేవాడు. ఆ విధంగా మూడు సంవత్సరాలు గడిచేసరికి, వాడు తనకంటేముందు చేరినవారిని కూడా అధిగమించి గురుకులంలో ప్రథముడుగా నిలిచాడు.
ఒక రోజు వితండుడు శిష్యులు అందర్నీ సమావేశ పరించి, “మీ లో రమాకాంతుడు ఎందుకూ కోరగానివాడని గుర్తించాను. ఇన్నేళ్ళ నా శిక్షణ వాడి విషయంలో వృధా అయిందని నాకెంతో బాధగా వుంది. మీలో ఎవరైనా వాడి బాధ్యతను స్వీకరించి, వాడి మెదడులో రవ్వంత జ్ఞానాన్ని ప్రవేశించ పెట్టినా, నాకు సంతోషం. అలా చేసినవాడికి నా తదనంతరం గురుకులం అప్ప జెబుతాను.” అన్నాడు.
ఇది వింటూనే రమాకాంతుడు కోపంగా లేచి, “నా సాటి వారిచేత పాఠాలు చెప్పించుకునేందుకు నేనిక్కడికి రాలేదు. నలుగురి ముందూ నా గురువే నన్నిలా అవమానించాక, నాకిక్కడ పనేముంది?” అని వెళ్ళిపోయాడు.
అప్పుడు వితండుడు నిట్టూర్చి, “రమాకాంతుడికి మంత్రి కావాలన్న కొరిక బలంగా వుంది. అందువల్ల ఏ విద్య అబ్బలేదు.” అన్నాడు.
మరొక రెండు సంవత్సరాలకు సునందుడి విద్యాభ్యాసం పూర్తయ్యింది. వాడు వితండుడిని గురుదక్షిణగా ఏమి కావాలని అడిగాడు.
“నువ్వు నా గురుకులాన్ని నడుపుతానంటే అదే నాకు గురుదక్షిణ!” అన్నాడు వితండుడు.
“గురువర్యా! గురువుకంటే ప్రథమ స్థానం తల్లిదని సర్వ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మాతృదక్షిణను కాదని గురుదక్షిణ ఇమ్మని తమరాదేసిస్తే, అలాగే చేస్తాను!” అన్నాడు సునందుడు.
“పదిహేనేళ్ళ వయసుకే ఇంతవాడివయ్యావు. నీ జ్ఞానం ఒక రాజ భావనానికీ, నీ తెలివి ఒక రాజుకు పరిమితం కావడం ఇష్టం లేక అలా అన్నాను. నీ మనసుకు తోచిన పని ఏది చేస్తే, అదే నా గురు దక్షిణ. వెళ్లిరా నాయనా!” అన్నాడు.
Gurudakshina_4సునందుడు విరూపదేశారిగ వెళ్ళాడు. సూరసేనుడు ఇప్పుడు రాజ్యమేలడం లేదని, ఆయన అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల మూడు సంవత్సరాల నించి ఆయన కుమారుడు వీరసేనుడు రాజ్యమేలుతున్నాడని తెలుసుకున్నాడు.
వీరసేనుడు గొప్ప అహంకారి. అన్నీ తనకే తెలుసనుకుంటాడు. తనకు సలహాలివ్వడానికి కాక, తను చెప్పింది అవుననడానికి మంత్రి కావాలి అతడికి! తన తండ్రి సూరసేనుడిని మెప్పించిన మంత్రి అనర్హుడని అంతా అనడం వల్ల, కొత్త మంత్రి కోసం ప్రకటన చేశాడు.
సునందుడు ఇల్లు చేరగానే తల్లి ఈ విషయాలన్నీ చెప్పి, “నువ్వు సరైన సమయానికి వచ్చావు. రేపే వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకోబోతున్నాడు. నువ్వాయనకు మంత్రివై, తండ్రిని మించిన తనయుడనిపించుకోవాలి.” అన్నది.
దురదృష్టం కొద్ది ఆ రాత్రే సునండుడికి వొళ్ళు తెలియని జ్వరం వచ్చింది. అప్పుడు రాజగురువు వచ్చి వాణ్ణి కలుసుకుని, “నాయనా! కొత్త మంత్రి ఎన్నిక అయిపొయింది. నీవు వచ్చినట్లు నాకు ఆలస్యంగా తెలిసింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. నాతొ వస్తే రాజుకు నిన్ను పరిచయం చేస్తాను. నేను చెబితే ఇద్దరు మంత్రులను తీసుకునేందుకు రాజు వెనకాడడు. ప్రస్తుత పరిస్థితిలో దేశానికి నీ అవసరం ఎంతైనా వుంది.” అన్నాడు.
సునందుడు అందుకు అంగీకరించినా, ముందుగా కొత్త మంత్రిని కలుసుకుని మాట్లాడాలన్నాడు. రాజగురువు వాణ్ణి కొత్త మంత్రి వద్దకు తీసుకు వెళ్ళాడు. వితండుడు ఎందుకూ పనికి రానివాడని తీర్మానించిన రమాకాంతుడక్కడ వాడికి కొత్త మంత్రి వేషంలో దర్శనమిచ్చాడు.
ఇద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నాక, రాజగురువు రామాకంతుడికి తన మనసులోని మాట చెప్పాడు. అందుకు రమాకాంతుడు ఎంతో సంతోషించి, “మనమిద్దరం కలిసి మంత్రులుగా ఒకే రాజు వద్ద పనిజేయడం, నా అదృష్టంగా భావిస్తాను.” అన్నాడు.
Gurudakshina_5సునందుడు మాత్రం రామాకాంతుడి భుజం తట్టి, “నేను నిన్ను అభినందించాలని వచ్చాను. గురువుగారు గురుకులం బాధ్యతా తీసుకుంటే, అదే నా గురుదక్షిణ అన్నారు. ఆయన మాట కాదనలేను. నేనిప్పుడు చండకారణ్యానికి వెళుతున్నాను.” అని ఇంటికిపోయి, తల్లిని వెంటబెట్టుకుని చండకారణ్యం లోని గురుకులానికి బయలుదేరాడు.
భేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, గురుదక్షిణకంటే, మాతృదక్షిణ ముఖ్యమని రాజ్యానికి తిరిగి వచ్చి మంత్రి కాదలచిన సునందుడు, మనసెందుకు మార్చుకున్నాడు? వీరసేనుడు కొత్త మంత్రిని కాదలచిన సునందుడు, మనసెందుకు మార్చుకున్నాడు? వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకునే రోజునే తనకు జ్వరం వచ్చి ఇల్లు కదలలేకపోవడం దైవ సంకల్పం అనుకున్నాడా? అలా కాక, రామాకాంతుడి వంటి పనికిమాలిన వాడితో కలిసి పని చేయడం అవమానంగా భావించాడా? అన్నిటినీ మించి, అలాంటి అసమర్థుడు మంత్రిగా ఉన్నప్పుడే రాజుకు తనబోటివాడి అవసరం అతిముఖ్యమని ఎందుకు గ్రహించలేక పోయాడు? వితండుడి వంటి ఉద్దండ పండితుడి వద్ద శిక్షణ పొందినా సునందుడిలో లోకజ్ఞానం, సమయ స్ఫూర్తి, లక్ష్యశుద్దీ లోపించడానికి కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది.” అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “తన విద్యా, తెలివితేటలూ ఒక రాజుకు పరిమితం చేయకుండా, ఎందరికో ఉపయోగపడేలా చేయమని గురువు చెప్పినా వినకుండా, సునందుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అందుకు కారణం వాడికి తల్లీ, రాజగురువుల పట్ల గల భక్తీ గౌరవాలు. అయితే, కొత్త రాజు వీరసేనుడు మంత్రిని ఎన్నుకున్న తీరు వాడిని ఆశ్చర్య పరచాడమేగాక, ఆలోచించేలా చేసింది. వీరసేనుడు ఆహంకారే కావచ్చు, కాని తెలివైనవాడు. ఆయన తెలివితక్కువ వాడైతే, మంత్రి తెలివైనవాడైనా తెలివి వృధా. సునందుడు తెలివైనవాడు కాబట్టి తన సలహాలతో రాజుకు సాయపడగలడు. అయితే రాజు తన తెలివి అంటా వెచ్చించి రామాకాంతుడిని మంత్రిగా ఎన్నుకున్నాడు. ఒక తెలివైనవాడు రామాకాంతుడి లాంటి వాణ్ణి మంత్రిగా ఎన్నుకున్నాడాంటే అర్ధమేమిటి? ఆయన దృష్టిలో మంత్రి పదవికి ఏమాత్రమూ విలువు లేదన్న మాట. అది కేవలం అలంకారప్రాయం మాత్రమే. అలాంటి మంత్రి పదవికోసం, సునందుడు తన విద్యావిజ్ఞానాలను వృధా చేసుకుంటే, అది మాతృ దక్షిణ అనిపించుకోదు. అందుకే వాటిని గురుదక్షిణ గా ఇచ్చి, గురుకులాన్ని సమర్ధవంతంగా నడిపి, తన జీవితాన్ని సార్థకం చేసుకుందామని అనుకున్నాడు. అంతేతప్ప, వాడిలో లోకజ్ఞతా, సమయ స్ఫూర్తి, లక్ష్యశుద్ధి లోపించడం వల్ల కాదు.” అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, భేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.
విక్రమార్కుడు-బేతాళుడు | Tagged: chandamama kathalu, kadhalu, kathalu, telugu, telugu కథలు, telugu నీతి కథలు, telugu blog, telugu books, telugu children stories, telugu folk tale, telugu folk tales, telugu kadhalu, telugu kathalu, telugu kids stories, telugu moral stories, telugu neeti kathalu, telugu short stories, telugu stories, telugu stories for children, telugu stories for kids, telugu story, tenali ramakrishna, vikram betal stories in telugu
పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో…
Telugu blog with stories for children and grown-ups alike – these are not original stories, rather, a compilation of folk tales and moral stories I’ve read since childhood.
Source of the content : https://kathalu.wordpress.com/
———-
Comments