రాక్షసుడిదానం Rakshasudi Danam Telugu Bethala kathalu for kids
దండకారణ్యంలో రక్తతర్పణుడనే రాక్షసుడుండేవాడు. ఆ అరణ్యం హిమగిరి,
సింహపురి అనే రెండు రాజ్యాలను కలిపేది. అందువల్ల అటుగా చాలామంది బాటసారులు ప్రయాణం చేస్తుండేవారు. రక్తతర్పణుడు దొరికిన వారిని దొరికినట్లు చంపి తినేవాడు.
ఒక పర్యాయం చంద్రకాంత అనే గంధర్వ కన్య భూలోకంలోని వింతలూ చూడడానికి వచ్చింది. ఆమె అద్భుత సౌందర్యరాశి. ఎంతో దయాస్వభావం కలది. ఆమె దండకారణ్యం లో విహరిస్తూండగా, ఆమె మెడలో ధరించించిన మణి ఒకటి జారి కింద పడింది. చంద్రకాంత అది గమనించలేదు. కొంతసేపటికి ఆమె అక్కడి నుంచి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది.
రక్తతర్పణుడు అరణ్యంలో బాటసారుల కోసం వెతుకుతూండగా, వాడికి చంద్రకాంత పోగొట్టుకున్న మణి కనిపించింది. అది వింత కాంతులు విరజిమ్ముతున్నది. రక్తతర్పణుడు దాన్ని తీసుకుని, బాగుందని మురిసిపోతూ మేడలో హారంగా ధరించాడు.
ఆ మణిని ధరించగానే రక్తతర్పణుడిలో విపరీతమైన భావ సంచలనం కలిగింది. పరమ క్రూరుడైన వాడి హృదయంలో ఒక్క సారిగా దయ, కరుణ చోటు చేసుకున్నాయి.
అంతలో వాడి దృష్టి అటుగా ప్రయాణం చేస్తున్న బాటసారుల మీద పడింది. ఒక చిన్నపిల్లవాడు తండ్రిని ఎత్తుకోమని మారాం చేస్తున్నాడు. తండ్రి, నా దగ్గర ఓపిక లేదు నడవమని వాణ్ణి కోప్పడుతున్నాడు. ఇది చూసి రక్తతర్పణుడు వాళ్ళ ముందుకు వెళ్ళి, “చిన్నవాడు నడవలేక పోతూంటే ఆ మాత్రం ఎత్తుకోలేవా? నా భుజాల మీద కూర్చోండి, క్షణంలో గమ్యం చేరుస్తాను,” అన్నాడు.
రాక్షసుణ్ణి చూడగానే బెంబేలెత్తి పోయిన ఆ బాటసారి, కొడుకునెత్తుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
బాటసారి కనిపించగానే విరుచుకుతిని ఆకలి తీర్చుకోవాలసిన తను, వాడికి సహాయ పడాలనుకోవడం రక్తతర్పణుడికి చాల ఆశ్చర్యం కలిగించింది. వాడు తనకేం జరిగిందా అని విచారపడుతూ, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వాణ్ణి అటుగా పోతున్న ధర్మవేదుడు అనే ముని చూశాడు. ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు.
ఆయన రక్తతర్పణుడి విచారానికి కారణం గుర్తెరిగి, వాణ్ణి సమీపించి, “రాక్షసా! నీ ప్రవర్తన నీకే వింతగా వున్నది కదా! దానికి కారణం నువ్వు మెడలో ధరించిన మణి. ఆ మణి ఎంతో దయామయురాలైన చంద్రకాంత అనే గంధర్వకన్యది. ఆ మణికి మనస్సులోని కోర్కెలను తీర్చగల మహిమ వున్నది. అందువలన నువ్వు ఇతరులకు సహాయపడాలనుకుంటే మనుష్యరూపం ధరించి సహాయ పడవచ్చు,” అని చెప్పి ముందుకు సాగిపోయాడు.
ముని చెప్పింది విన్న రక్తతర్పణుడు, మణి ప్రభావం పరీక్షించడానికి మనుష్యరూపం కావాలని కోరుకున్నాడు. మరుక్షణం వాడి రూపు మానవుడిగా మారిపోయింది.
ఆనాటి నుంచి రక్తతర్పణుడు, ఆ అరణ్యం గుండా ప్రయాణించే బాటసారులకు సహాయంచేయసాగాడు. వాళ్ళను దోచుకునే దోపిడీ దొంగలను తుదముట్టించాడు. బాటసారులు నీళ్ళకోసం ఇబ్బంది పడకుండా మార్గంలో అక్కడక్కడా బావులు తవ్వాడు. ముళ్ళ పొదలనునరికి మార్గాన్ని మరింత సుగమం చేశాడు.
అయితే, ఎవరూ ఊహించని అవాంతరం ఒకటి వచ్చి పడింది. ముని ధర్మవేదుడు, రక్తతర్పణుడికి మణి ప్రభావం వివరిస్తూండగా, అక్కడ ఉన్న చెట్టు కొమ్మమీద దాగి వున్న ఆదిత్యుడనే సింహపురి గూఢచారి విన్నాడు.సింహపురి రాజు విక్రమభూపతికి రాజ్య కాంక్ష ఎక్కువ. ఆయన పొరుగు రాజ్యం హిమగిరి మీద యుద్ధం ప్రకటించి, దాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేశాడు.
హిమగిరి రాజు విజయాదిత్యుడు ధర్మ ప్రభువు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా వున్నది. ప్రజలు సుఖసంతోషాలతో కాలం గడుపుతున్నారు.
విక్రమభూపతి యుద్ధ ప్రతిపాదన విని, విజయాదిత్యుడు తల్లడిల్లిపోయాడు. కారణం, హిమగిరి ఆర్ధికంగానూ, సైనికపరంగాను సింహపురితో పోలిస్తే బలహీనమైనది. విజయాదిత్యుడు పంపిన సంధి ప్రతిపాదనకు, విక్రమభూపతి అంగీకరించకపోవడంతో యుద్ధం తప్పనిసరి అవబోతున్నది.
సింహపురి గూఢచారి ఆదిత్యుడు సింహపురిచేరి, రాజు విక్రమభూపతికి తను అరణ్యంలో చూసినది చెప్పి, రాక్షసుడి నుంచి మహిమగల మణిని సంపాయించితే చుట్టూ పక్కల గల అన్ని రాజ్యాలను జయించవచ్చని వివరించాడు.
ఇది విన్న విక్రమభూపతికి అప్పుడే తను చక్రవర్తి అయినంత ఆనందం కలిగింది. ఆయన రక్తతర్పణుడిసహాయం అర్థించడానికి రథం మీద బయలుదేరాడు.
అదే సమయంలో హిమగిరిరాజు విజయాదిత్యుడు, రానున్న యుద్ధం గురించి తన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు మారువేషంలో రాజ్య సంచారానికి బయలుదేరాడు. ఒకచోట ఆయనకు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ముని ధర్మవేదుడు కనిపించాడు. అయన ముఖం లోని దివ్యతేజస్సు గమనించిన విజయాదిత్యుడు, ఆయనను సమీపించి వినయంగా నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
ధర్మవేదుడు, రాజునూ తేరిపార చూసి, “రాజా! నీ మనసులోని ఆవేదన గ్రహించాను. సింహపురి రాజు విక్రమభూపతిని ఎదుర్కోవాలంటే, ఒకేఒక మార్గమున్నది. నువ్వు వెంటనే బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళు. అక్కడ రక్తతర్పణుడనే రాక్షసుడున్నాడు. వాడిప్పుడు ఒక మణి ప్రభావంవలన మారిపోయి మనుష్యరూపంలో ఆపదలో వున్నవారికి సహాయపడుతున్నాడు. వాడి మెడలోని మణి కారణంగా నువ్వు వాడిని గుర్తించవచ్చు. వాడికి పరిస్థితి వివరించి, ఆ ప్రభావంగల మణిని సంపాయించే ప్రయత్నం చెయ్యి,” అని సలహా ఇచ్చాడు.
విజయాదిత్యుడు, రక్తతర్పణుణ్ణి కలుసుకునేందుకు గుర్రం మీద వెంటనే బయలుదేరాడు. కాని, ఈలోపలే సింహపురి రాజు విక్రమభూపతి, మనుష్యరూపంలో వున్న రక్తతర్పణుణ్ణి కలుసుకుని, “రాక్షసోత్తమా, తమ గురించి విన్నాను. నేను సింహపురి రాజైన విక్రమభూపతిని. తమలోతాము కీచులాడుకుంటున్న అన్ని రాజ్యాలను ఏక ఛత్రాధిపత్యం కిందికి తీసుకువచ్చి, ప్రజారంజకంగా పాలన చేయాలనే సదుద్దేశంతో, తమ దర్శనానికి వచ్చాను. మీరు దయతలచి ప్రభావం గల మణినినాకిస్తే, ఎందరికో సహాయం చేసిన వారవుతారు,” అని వేడుకున్నాడు.
దానికి రక్తతర్పణుడు, “ నేను ముందుగా నీ రాజ్యానికి వచ్చి, నీ పాలన ఎలా వున్నదో చూడాలి. ఆతర్వాత మాత్రమే మణిని నికిచ్చేసంగతి నిర్ణయించగలను,” అన్నాడు.
విక్రమభూపతి, రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పుకుని తన రాజధానికి వెళ్ళిపోయాడు.
ఆమర్నాడు విజయాదిత్యుడు, అరణ్యంలో రాక్షసుణ్ణి గుర్తించి, “మహానుభావా! నేను హిమగిరి రాజు విజయాదిత్యుణ్ణి. సింహపురి రాజు విక్రమభూపతి రాజ్యకాంక్షతో, నా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు. మీ మణి సహాయం తో తప్ప అతణ్ణి నేను జయించలేను. ధర్మబద్ధుడినైన నాకు సహాయపడగలరని నమ్ముతున్నాను,” అన్నాడు.
అందుకు రక్తతర్పణుడు, “రాజా, విచారించకు. నీ రాజ్యానికి వచ్చి ప్రజల స్థితి ఎలా వున్నదీ గమనించాక, నీకు సహాయం చేసే విషయమై నిర్ణయం తీసుకుంటాను. నీ శత్రువైన విక్రమభూపతిక్కూడా ఇలాగే మాట ఇచ్చాను,” అన్నాడు.
విజయాదిత్యుడు, రక్తతర్పణుడికి నమస్కరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు.
రక్తతర్పణుడు ముందుగా హిమగిరి రాజ్యానికి వెళ్ళాడు. అక్కడి పరిస్థితులను చూసి, విజయాదిత్యుడు ధర్మప్రభువనీ, అతడి పాలనలో ప్రజలు సుఖంగా వున్నారనీ గ్రహించాడు. ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు సింహపురి రాజు సైన్యాన్ని ఆయత్త పరుస్తున్నాడని కూడా తెలుసుకున్నాడు. తర్వాత అతడు సింహపురి రాజ్యం వెళ్ళాడు. అక్కడ రాజు విక్రమభూపతి క్రూర పరిపాలన గురించీ, రాజ్యవిస్తరణకాంక్ష గురించీ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు.
ఆ ఇద్దరు రాజుల్లో ప్రభావంగల మణిని ఏ రాజుకివ్వాలా అని రక్తతర్పణుడు కొంచెం సేపు అలోచించి, రాజు విక్రమభూపతిని కలుసుకొని, “రాజా! ఈ ప్రభావంగాల మణిని నీకు ఇవ్వదలిచాను, స్వీకరించు!” అని మణిని ఆయనకిచ్చి, అరణ్యంకేసి సాగిపోయాడు.
బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, రక్తతర్పణుడు చేసింది కేవలం అపాత్రదానమే కదా! తన ప్రజలను అతి క్రూరంగా పరిపాలిస్తూండడమే కాక, యుద్ధం ద్వారా పొరుగు రాజ్యాలను ఆక్రమించి చక్రవర్తి కావాలనుకునే కాంక్ష కలవాడు విక్రమభూపతి. ఈ విషయం రక్తతర్పణుడు స్వయంగా తెలుసుకున్నాడు. అటువంటి రాజుకు ప్రభావం గల మణి దానం చేయడమంటే, ఆ రాజు మరింత యథేచ్ఛగా తన ప్రజలనూ, పొరుగు రాజ్య ప్రజలనూ హింసలపాలు చేయడానికి సహాయ పడడమే కదా? ఇంత అవివేకమైన అపాత్రదానానికి రక్తతర్పణుడు ఎందుకు పూనుకున్నాడు? ఆ మణిని విక్రమభూపతికి కాక, ఎంతో శాంత స్వభావుడూ, ధర్మప్రభువూ అయిన విజయాదిత్యుడికి దానం చేసి వుంటే, అతడు తనపై యుద్ధానికి రానున్న విక్రమభూపతిని ఓడించి, ఆ రాజ్య ప్రజలను కూడా ధర్మంగా పాలించి వుండేవాడు కదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో, నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “రక్తతర్పణుడు చేసిన పని పైకి అవివేకంగా, అపాత్రదానంగా కనిపించవచ్చు. కాని, అతడు తన స్వానుభవాన్ని ఆధారం చేసుకొని ఎంతో వివేకంగా ప్రవర్తించాడు. దారేపోయే మనుషులని చంపి తినే క్రూర స్వభావుడైన తనను, ఆ మణి అతి సాధుస్వభావుణ్ణి చేసింది. అందువల్ల, రాజ్యకాంక్షతో యుద్ధాలు ప్రారంభించి ప్రజాక్షయానికి సిద్ధపడే విక్రమభూపతిని, ఆ మణి తప్పక సాధుస్వభావుణ్ణీ, ప్రజారంజకంగా రాజ్యం పాలించే ప్రభువునూ చెయ్యగలదు. వస్తుతః సాత్వికుడూ, ధర్మమార్గాన నడిచే విజయాదిత్యుడుపై కొత్తగా ఆ మణి చూపే ప్రభావం ఏమీ వుండదు. అందువల్ల దానిని అతడికి దానం చేయడం వృథా. ఇదంతా ఆలోచించే రక్తతర్పణుడు మణిని పాత్రుడైన వాడికే దానం చేశాడు,” అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహామాయమై, తిరిగి చెట్టెక్కాడు.
— (కల్పితం)
[ఆధారం: ఎన. శివనాగేశ్వరరావు రచన]
Comments